పుస్తకం... ఓ రచయిత అనుభవాల సారం. ఎన్నో ఏళ్ల అనుభూతులు, విశ్లేషణలకు ప్రతిఫలం. పుస్తకం కొందరికి జీవితాన్ని నేర్పితే... మరికొందరి జీవితాలనే మార్చేస్తుంది. అందుకే… చిన్న వయస్సు నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలి. అలా చిన్నప్పటి నుంచే సాహిత్యాన్ని ఒంటపట్టించుని... అదే సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమి బహుకరించే ప్రత్యేక యువ పురస్కారానికి దక్కించుకుంది... మానస ఎండ్లూరి. తెలుగు సాహిత్య రంగంలో తనదైన శైలిలో పయనిస్తోంది. నలుగురు నడిచే దారిలో కాకుండా... తనకు ఎదురైన అనుభవాలు, తాను చూసిన సంఘటనల ఆధారంగానే రచనలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటోంది. అలా రాసిందే... మిళింద కథలు.
2015 నుంచి కథలు రాస్తున్న మానస... తెలుగు సాహిత్యంలో చోటులేక వెనుకబడిపోయిన వర్గాల కథల్ని తాను వినిపిస్తున్నానని చెబుతోంది. ఆయా వర్గాల (దళిత, క్రైస్తవ) మహిళలు సమస్యలు, వివక్ష, జీవన విధానాలు, సామాజిక పరిస్థితులు, స్త్రీ-పురుష సంబంధాలు, స్వలింగ సంపర్క బంధాలు వంటి క్లిష్టమైన అంశాలను 22 కథలుగా మలిచింది. ఇప్పటికే.. వివిధ దినపత్రికల్లో ప్రచురితం కాగా.. వాటన్నింటినీ ఒక్కచోట కూర్చి 2018లో మిళింద పేరుతో పుస్తకంగా తీసుకువచ్చింది.
సాహిత్య వాతావరణం..
మానస తండ్రి ఎండ్లూరి సుధాకర్... తెలుగు ఆచార్యుడు, తల్లి హేమలత రచయిత్రి. దీంతో ఇంట్లో ఎప్పుడూ సాహిత్య వాతావరణమే కనిపిస్తుండేది. పైగా తండ్రి వెంట చిన్నప్పటి నుంచే సాహితీ సభలు, చర్చలకు వెళ్తుండడంతో... ఆ ప్రభావం ఎక్కువగా పడింది. ఏపీ ఏలూరులోని సెయింట్ థెరిసా మహిళా కళాశాలలో మానస... సైకాలజీ చదివింది. అనంతరం హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్స్‌లో పీజీ చేసింది. ఆ సమయంలో తాను చూసిన సంఘటనలే తన రచయనలు మూలం అనిచెబుతోంది...మానస.
వాళ్లకి దక్కిన గౌరవం..
తన పుస్తకం కేంద్ర సాహిత్య పురస్కారం దక్కడం దేశవ్యాప్తంగా వివక్షకు గురవుతున్న మహిళలకు దక్కిన గౌరవమని ఆనందం వ్యక్తం చేస్తోంది. సామాజిక అంశాల ఆధారం రాసిన పుస్తకాలను గుర్తించడం మంచి పరిణామమని అంటోంది. పుస్తక పఠనం తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి బహుమతలు యువ రచయితలకు మంచి ప్రోత్సాహం ఇస్తాయని అంటోంది.
అక్కడే ఆగిపోయారు..
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తున్న యవతరం శ్రీశ్రీ, చలం దగ్గరే ఆగిపోయిందని.. నేటి తరం రచనలను చదవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2016లో త్రిపురలో కేంద్ర సాహిత్య అకాడమి నిర్వహించిన అఖిల భారత యువ రచయితల సదస్సులో పాల్గొన్న మానస... 2018 అస్సాంలో నిర్వహించిన సదస్సుకు తెలుగు నుంచి ఎంపికైక ఏకైక రచయిత్రిగా గుర్తింపు పొందింది. అలాగే 2017లోనూ కొన్ని స్మారక పురస్కారాలు అందుకుంది. స్త్రీల ఇబ్బందులపై పురుషులే రచనలే చేస్తున్నారని... మహిళలే వాళ్ల కథలు, బాధలు వాళ్లే చెప్పుకునే రోజులు రావాలని కోరుకుంటోంది.
తెలుగులో మరింత మంది రచయిత్రులు రావాలనేది తన కోరిక అంటున్న మానస... తనకు పరిచయమైన ప్రతి ఆడపిల్లను సాహిత్యంపై అభిలాష కలిగేలా తీర్చిదిద్దుతానంటోంది.
ఇదీ చూడండి: ఉద్యోగం చేయం.. ఉపాధి కల్పిస్తాం