కరోనాపై పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి?
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక శాస్త్రవేత్తలకు ఇంతగా సవాలు విసిరిన అంశం మరొకటి లేదు. దీనిపై పరిశోధనలో వివిధ సంస్థలు, కంపెనీలు, విశ్వవిద్యాలయాలు చురుకుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 8124 పేటెంట్లకు వివిధ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని ఎన్‌ఆర్‌డీసీ అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్-19 వైరస్ ఎస్, ఎం, ఈ, ఎన్ అనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎస్ ప్రొటీన్ కీలకం. ఎస్ ప్రొటీన్ ప్రవేశించకుండా మన శరీరంలో ప్రొటీన్ లేదా ప్రతినిరోధకం (యాంటీజెన్) ఉండాలి. ప్రధానంగా ఈ ప్రొటీన్, ప్రతినిరోధకానికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకున్న పేటెంట్ల విశ్లేషణ ఎలా ఉంది?
అమెరికా, కెనడా, చైనా, జర్మనీ, హాంకాంగ్, దక్షిణకొరియా, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, స్పెయిన్, ఇజ్రాయెల్ సహా అనేక దేశాల సంస్థలు పేటెంట్లకు దరఖాస్తు చేసుకున్నాయి. నోవార్టిస్, ఫిఫెజర్, జీఎస్‌కే, జోర్టెక్స్, అస్ట్రాజెనికా, మెడిమ్యూన్, వైత్ వంటి సంస్థలు, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలు సహా పలు విద్యాసంస్థలు ఉన్నాయి. వైరస్ గుర్తింపు, దాన్ని నియంత్రించే వైద్యం, వైరస్ సోకకుండా నివారణ ఈ మూడు అంశాలపై పరిశోధనలు జరుగుతున్నట్లు పేటెంట్ల ద్వారా వెల్లడైంది. ప్రధానంగా వ్యాక్సిన్‌కు సంబంధించి 10.54 శాతం పేటెంట్ దరఖాస్తులున్నాయి.
ఇప్పటి వరకూ వచ్చిన ఆవిష్కరణలెలా ఉన్నాయి?
దేశంలో కొవిడ్-19తో ముడిపడి అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వెంటిలేటర్లు, మాస్క్‌లు, శానిటైజర్లు, పరిశుభ్రత సామగ్రి సహా సుమారు 200 రకాలకు పైగా కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. ఎన్‌ఆర్‌డీసీ అన్నిటినీ ఒక చోటుకు తీసుకువచ్చి సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.
మన దేశ పరిశోధనల్లో కీలక అంశాలేమిటి?
దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న వివిధ వ్యాక్సిన్లు వైరస్‌ను నిరోధించేందుకు ఎలా పనిచేస్తాయనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. మలేరియా నివారణకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్, క్షయ, కుష్ఠు నిరోధానికి వినియోగించే వ్యాక్సిన్లు, బీసీజీ సహా వివిధ వ్యాక్సిన్లు కొవిడ్-19ను నివారణకు ఎంత వరకు పనిచేస్తాయో అధ్యయనం చేస్తున్నారు. ఇవి ఫలిస్తే తక్కువ సమయంలో వ్యాక్సిన్ లేదా మందులు అందుబాటులోకి రావచ్చు. తక్కువ ధరకు లభ్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
కొవిడ్-19కు సంబంధించి ఎన్‌ఆర్‌డీసీ కార్యాచరణ ఏమిటి?
ఈ వైరస్‌ను ఎదుర్కొనే ఆవిష్కరణలకు, సాంకేతికతకు, పరిశోధనలకు ఎన్‌ఆర్‌డీసీ తోడ్పాటును అందిస్తుంది. రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఆర్థిక తోడ్పాటు ఇస్తుంది. దీని కోసం మే 15వ తేదీ లోపు ఎన్‌ఆర్‌డీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
భారత్‌లో పరిశోధనల పరిస్థితి ఏమిటి?
ఇక్కడ కూడా అనేక సంస్థలు పరిశోధనల్లో చురుకుగా ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఏడు సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇది కాక వివిధ పరిశోధన సంస్థలతో పాటు విద్యాసంస్థలు, రక్షణ పరిశోధన...అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాస్త్ర సాంకేతిక శాఖతో పాటు సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లు, ఐఐటీ బాంబే, బెంగళూరులోని జెఎన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చి సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.