ఆ తర్వాత..
మామ కామాంధుడిగా మారాడు.. అత్త ఆయనకు తోడుగా నిలిచింది.. భర్త కూడా వాళ్లకు వంత పాడాడు.. ఆడపిల్ల పుట్టిందని నెపం మోపారు.. అందరూ కలిసి ఇంటి నుంచి గెంటేశారు.. కాపురం కావాలంటే కోటి రూపాయలు తేవాలన్నారు..!!
అత్తింటికి వచ్చిన కోడలిని ’’తన కోరిక తీర్చమంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నిత్యం వేధిస్తున్నాడని కన్నీరు పెట్టుకుంటూ బాధిత యువతి సోమవారం స్పందనలో గుంటూరు అర్బన్ ఏఎస్పీ గంగాధరానికి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఏఎస్పీ విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత యువతి తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే...
'నేను ఎంబీఏ చదువుకున్నా. ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి కుమారుడితో వివాహం చేశారు. కట్నంగా రూ.40 లక్షలు, కిలో బంగారం, కారు, ఇంటి సామగ్రికి మరో రూ.20 లక్షలు ఇచ్చారు. పెళ్లైన కొద్దిరోజుల తర్వాత అర్ధరాత్రి సమయంలో మామయ్య వచ్చి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కేకలు వేయటంతో అత్తింటివాళ్లు వచ్చి కాపురం గుట్టుగా చేసుకోవాలి లేకపోతే పుట్టింటికి పంపిస్తామని బెదిరించారు. అత్తకు చెబితే ఇవన్నీ ఉన్నత కుటుంబాల్లో సహజమేనంటూ చెప్పడంతో నిర్ఘాంతపోయాను. ఈ విషయం మా పుట్టింటి వాళ్లకు చెప్పాను. వాళ్లు వచ్చి మాట్లాడితే అలాంటిది ఏమీ లేదన్నారు. గర్భవతిగా ఉన్న నేను ఆడపిల్లకు జన్మనిచ్చాను. కొద్ది రోజుల తర్వాత నా భర్త టూర్‌కు వెళ్లిన రోజు రాత్రి వేళ మామయ్య నా గదిలోకి వచ్చి తనకు సహకరిస్తే నా కాపురం నిలబెడతానంటూ బెదిరించాడు. భయపడిన నేను నా పాపతో సహా బయటకు వచ్చేశాను. అత్తకు చెబితే ఆమె తన భర్తను సమర్థించింది. అదేమంటే నీ భర్త టూర్లకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేయడం లేదా అంటూ ప్రశ్నించింది. విషయమంతా భర్తకు వివరిస్తే నాపై కోపగించుకొని కట్టుబట్టలతో పుట్టింటికి గెంటేశాడు. ఈ విషయంపై మా తల్లిదండ్రులు నిలదీస్తే నాకు ఆడపిల్ల పుట్టింది కాబట్టి రూ.కోటి అదనపు కట్నం ఇవ్వాలని లేకపోతే తన కుమారుడికి మరో పెళ్లి చేస్తామంటూ బెదిరించారు. అంతే కాకుండా మామ నాతో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాలు బయటపెడితే నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారు. విచారించి నా మామయ్యపై చర్యలు తీసుకొని భర్తతో నా కాపురం నిలబెట్టాలని కోరాను.'