తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా వసూలవుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 1,395 కోట్ల మేర రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మార్చి చివరి నాటికి మరో 2 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు రాబోవు ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజు పెంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధమవుతోంది.
రిజిస్ట్రేషన్ శాఖ జీఎస్టీ మినహాయించి ఆస్తులు, కొనుగోలుదారుల నుంచి 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తోంది. 2013లో నిర్ణయించిన ఈ రిజిస్ట్రేషన్ ఫీజులే ఇప్పటికీ అమలులో ఉన్నాయి. అప్పటి నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచలేదు. తాజాగా ప్రభుత్వం ఈ ఫీజులు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ఏ విధానంలో ఫీజులు పెంచాలన్న కోణంలో ఉన్నత స్థాయిలో అధ్యయనం జరుగుతోంది. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న ప్రదేశాలను 3 కేటగిరీలుగా విభజన చేసి ఫీజు పెంపు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ పెంపు వల్ల రాష్ట్రానికి అదనంగా మరో 3 వేల కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ వరస హత్యలు చేసింది సైకో కిల్లరా?