రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ శాతం పెంచకుండా 17 కులాలను బీసీల్లో కల్పినప్పటికీ బీసీ రిజర్వేషన్లను మాత్రం పెంచలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పేద, మధ్య తరగతి వర్గాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎల్ఆర్ఎస్ భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 23న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టర్ను విడుదల చేశారు.
96 కులాలున్నప్పుడు 25 శాతమే...
బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రారంభ దశలో 96 కులాలు ఉన్న సమయంలో 25 శాతం రిజర్వేషన్ ఉండేది. అనంతరం పలు సందర్భాల్లో నేటి వరకు 36 కులాలను అదనంగా చేర్చారని పేర్కొన్నారు. ఇన్ని కులాలను బీసీ కోటాల్లో చేర్చారని... ఇప్పటికీ అదే 25 శాతం రిజర్వేషన్ కొనసాగుతుందని ఆసంతృప్తి వ్యక్తం చేశారు.
మేమెంతో మాకు అంతే..
ఈ లెక్కన రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నపుడు 56 శాతం రిజర్వేషన్ ఉండాలని క్రిష్ణయ్య స్పష్టం చేశారు. రిజర్వేషన్ శాతం పెంచకుండా కొత్తగా కులాలను చేర్చడం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వాన్ని, బీసీ కమిషన్ను ప్రశ్నించారు. కేంద్రం స్థాయిలో బీసీల గణన చేపట్టి ఓబీసీలకు న్యాయం చేయాలని.. లేని పక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓబీసీల నుంచి తిరుగుబాటు ఎదురువుతుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
ఇవీ చూడండి : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరోసారి కరోనా పరీక్షలు