ఎన్నికల్లో మీ ఓటు ఇంకొకరు వేశారా - ఇలా చేస్తే మీ హక్కు మీరే వినియోగించుకోవచ్చు - తప్పు ఓటు వేస్తే ఎలా కంప్లెయింట్ చేయాలి
What Is Tender Vote : ఓటేయడానికి వెళ్లినప్పుడు సాధారణంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతుంటాయి. ఓటింగ్ సమయంలో ధ్రువీకరణ సమస్యలు, దొంగ ఓట్ల బెడద కొనసాగుతూనే ఉంది. వాటికి చెక్ పెట్టి.. ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం కొన్ని అవకాశాలు కల్పించింది. అవే టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు. ఇవేం పేర్లు, కొత్తగా ఉన్నాయని అనుకుంటున్నారా..? ఎప్పటినుంచో ఉన్నవే. కానీ వీటికి జరిగిన ప్రచారం మాత్రం కాస్త తక్కువ.. అసలు టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు అంటే ఏంటి..?
Published : Nov 29, 2023, 2:38 PM IST
What Is Tender Vote : పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో పలు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది దొంగ ఓట్ల బెడద. అందుకు పరిష్కారంగా వచ్చిందే టెండర్ ఓట్ ప్రక్రియ(Tender Vote Process). ఓటరు పోలింగ్ స్టేషన్‌లో ఓటు వినియోగించుకునే లోపే.. వేరే వ్యక్తి సదరు ఓటు వేస్తే.. అసలైన ఓటరు ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత అధికారి ఓటరు ధ్రువపత్రాలను పరిశీలించి ఈవీఎంలో కాకుండా బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
Fraud Vote Complaint : రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ప్రతి పోలింగ్ సెంటర్‌కు ఎన్నికల సంఘం 10 బ్యాలెట్‌ల చొప్పున పంపిణీ చేసింది. ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్-1961 సెక్షన్ 49పీ ప్రకారం ఓటరు వెళ్లే సమయానికి వేరే వాళ్లు ఓటేస్తే.. టెండర్ ఓటు వాడుకునే హక్కు ఉంది. టెండర్ ఓటు లాగే మరో అవకాశం కూడా ఉంది. అదే ఛాలెంజ్ ఓటు(Challenge Vote Importance). ఓటేయడానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్ ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తి మీరు కాదు అని అభ్యంతరం తెలిపితే.. అప్పుడు దీనిని వినియోగించుకోవాలి.
How to Register to Vote Telangana : ఓటు హక్కే మీ వజ్రాయుధం.. ఈ హక్కును వదులుకోవద్దు
What Is Challenge Vote : ఛాలెంజ్ ఓటు వేసిన ఫిర్యాదుదారుడి నుంచి సంబంధిత ఎన్నికల అధికారి రూ.2 రుసుం తీసుకుని రసీదు ఇస్తారు. వచ్చిన ఓటరు అసలైన వ్యక్తా.. కాదా అని విచారిస్తారు. అసలైన ఓటరు అని తేలితే అతడికి ఓటు హక్కు కల్పించి రూ.2 జప్తు చేస్తారు. నిజమైన ఓటరు కాని పక్షంలో ఓటరు నుంచి రూ.2 తీసుకుని ఏజెంట్‌కు అందించి.. సదరు వ్యక్తిని ఓటు వేసేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు. ఇవే కాకుండా ఓటేసే వ్యక్తి వయసు 18 ఏళ్ల కంటే తక్కువగా ఉందని అనుమానంగా ఉంటే ఆ వ్యక్తి ద్వారా రాతపూర్వక డిక్లరేషన్ తీసుకుని ఓటేసే అవకాశం కల్పిస్తారు. దీనిని ఫారం 16లో నమోదు చేయాల్సి ఉంటుంది.
Voter Rights in INDIA : ఓటేసిన తర్వాత వీవీప్యాట్ నుంచి వచ్చే స్లిప్‌లో.. మనం ఓటేసిన వ్యక్తికి కాకుండా వేరేది వస్తే.. రాతపూర్వకంగా అభ్యంతరం తెలపవచ్చు. దానిని సంబంధిత అధికారులు రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అనంతరం మరోసారి పరిశీలించి.. తగు విధంగా చర్యలు తీసుకుంటారు. వీవీప్యాట్ నుంచి వచ్చిన స్లిప్ సరిగానే ఉంటే ఆ పూర్తి వివరాల్ని 17సీ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది.
కామారెడ్డిలో టెండర్ ఓటు... రీపోలింగ్!
భారత రాజ్యాంగం(Constitution of India).. 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికు ఇచ్చిన పాశుపతాస్త్రం ఓటుహక్కు. ఇలాంటి సందర్భాల్లో ఓటర్లు అవగాహనలేమితో కొన్నిసార్లు పొరపాటున తమ హక్కుకు దూరమవుతున్నారనే ఉద్దేశంతో ఇలాంటి వెసులుబాట్లు కల్పించింది ఎన్నికల సంఘం. వీటిని ఉపయోగించుకుని నవసమాజ నిర్మాణంలో భాగస్వాములవడం ఓటరుగా మన బాధ్యత అనేది ప్రతీ ఓటరు గుర్తుంచుకోవాలి.