భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బండ రావిరాల, చిన్న రావిరాల సర్వే నంబర్ 268లో భూములను కోల్పోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ భూ నిర్వాసితులు బండ రావిరాలలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం నాయకులతో కలిసి తమ్మినేని మద్దతు ప్రకటించారు.
రైతుల భూములను అక్రమంగా తీసుకొని అధిక ధరకు మైనింగ్ వ్యాపారులకు విక్రయించి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందని తమ్మినేని ఆరోపించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేసే వరకు వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా పాదయాత్రను చేపట్టానని తమ్మినేని గుర్తుచేశారు. అయినా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. భూములు కోల్పోయిన రైతులకు సీపీఎం పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరగకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీచూడండి: Lift Irrigation schemes: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ఉత్తర్వులు జారీ