ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం తుదిదశకు చేరుకుంది. 2022 జనవరి అర్హతా తేదీతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణను చేపట్టింది. అప్పటి వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించింది. దాని ప్రకారం రాష్ట్రంలో 3 కోట్ల 3 లక్షల 56 వేల 665 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించింది. ఇందులో పురుషులు 1,52,57,690 కాగా... మహిళల సంఖ్య 1,50,97,292 ఉన్నట్లు పేర్కొంది. ఇతరులు 1,683 మంది ఉన్నారు. ముసాయిదాపై నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ గడువులోగా 2,66,514 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఇందులో కొత్తగా ఓటుహక్కు కోసం వచ్చిన దరఖాస్తులు 1,38,006 అర్జీలు ఉన్నాయని వెల్లడించారు. మార్పులు, చేర్పులకు సంబంధించి 30వేలకు పైగా వచ్చినట్లు వెల్లడించారు.
పెరిగిన దరఖాస్తుల సంఖ్య
దరఖాస్తులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మొదటి సారి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య బాగానే ఉందన్నారు. తొలిసారి ఓటుహక్కు పొందిన వారికి ఉచితంగా ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చే విధానాన్ని గతేడాది నుంచి ఈసీ అమలు చేస్తోంది. ఈ ఏడాది ఆ సదుపాయం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
పురోగతిపై సమీక్ష
సవరణ ప్రక్రియలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇప్పటికే జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ఆయన పురోగతిని సమీక్షించారు.
ఇదీ చదవండి:
MLCs Oath: ఐదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం.. బండ ప్రకాశ్ గైర్హాజరు