ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు పలికినందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ... మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను ఆ కమిటీ ప్రతినిధులు కలిశారు. తెలుగు ప్రజలకు గర్వకారణమైన కర్మాగారాన్ని సందర్శించాలని మంత్రిని కోరారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతిస్తే ఏపీ విషయాలు నీకెందుకని అంటున్నారని తెలిపారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారని ప్రశ్నించారు. మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలమని ఆయన అన్నారు.
ఎవరికో కష్టం వచ్చింది.. నాకెందుకులే అనుకుంటే సరికాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయనివ్వమని పేర్కొన్నారు. కేంద్రం 30 రోజుల్లో 100 పీఎస్‌యూలు అమ్మేందుకు ప్రణాళిక చేసిందని విమర్శించారు. 80 వేల మంది బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులను రోడ్డున పడేశారని మండి పడ్డారు. లాభాల్లో ఉన్న బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నారని... భాజపాకు ఓటు వేయడం.. ప్రైవేటీకరణను ప్రోత్సహించడమే అని వెల్లడించారు.
ఇదీ చూడండి : మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా?: కేటీఆర్