విశాఖ ఐఐఎం విద్యార్థులు 100 శాతం ప్లేస్మెంట్ దక్కించుకున్నారు. అత్యధిక వేతనంతో ఐఐఎం విద్యార్థులను నియమించుకునేందుకు వివిధ కంపెనీలు ఉత్సాహం చూపించాయి. అత్యధిక పారితోషికం రెండు లక్షలు కాగా.. సగటు పారితోషికంగా లక్షా 17 వేల రూపాయిలను నెలకు ఇవ్వనున్నారు. ఏటా వేసవిలో పరిమిత కాలానికి వీరంతా వివిధ కంపెనీలతో పని చేయాల్సి ఉంటుంది.
ఈ సారి మాత్రం కంపెనీలే అత్యధిక వేతనంతో ఐఐఎం విద్యార్థులను నియమించుకునేందుకు ఉత్సాహం చూపి పోటీ పడ్డాయి. అత్యధిక మార్కులు సాధించిన పదిమందికి సగటున లక్షా 46వేల రూపాయిల పారితోషికం లభించనుంది. ఇది గతేడాది సగటుతో పోలిస్తే దాదాపు 62,264 రూపాయలు ఎక్కువ. కనీసం 20.4 శాతం మేర ఈ పారితోషిక శ్రేణి పెరిగిందని ఐఐఎం విశాఖపట్నం వెల్లడించింది.
ఐటీ, ఎడ్ టెక్, నిర్మాణ రంగం, మౌలిక వసతుల రంగం, బ్యాంకులు, ఆహార పరిశ్రమ, మార్కెటింగ్ వంటి రంగాల్లో వీరికి అవకాశం లభించింది. ఇందులో దాల్మియా, ఐసీఐసీఐ, ఐఓసీ, ఎంటీఆర్, అవుట్ లుక్, ఆర్బీఐ, ఎస్ బ్యాంకు, టాటా వంటి ప్రముఖ సంస్థల మానవవనరుల విభాగం, మార్కెటింగ్, గణాంకాలు, ఆర్థిక విభాగం వంటి వాటిల్లో వీరు పని చేయాల్సి ఉంటుంది. వివిధ సంస్ధలు పోటీ పడి తమ విద్యార్థులను తీసుకునేందుకు అసక్తి కనబరచడం సంతోషంగా ఉందని ఐఐఎం విశాఖపట్నం డైరక్టర్ చంద్రశేఖర్ అన్నారు.
ఇదీ చూడండి: హ్యాపీ బర్త్డే కవితక్క.. వినూత్నంగా శుభాకాంక్షల వెల్లువ