Viral Fever Precautions Telugu : సీజన్ మారింది.. వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయి. పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువ.. రాత్రి పూట చలి.. ఈ మార్పుల కారణంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ వైరల్ జ్వరాలు(Viral Fevers), ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎవరిని అడిగినా.. ఈరెండు లక్షణాలతో పాటు గొంతు నొప్పి వంటి సమస్యలు చెబుతున్నారు. అయితే ఇంట్లో వాళ్లను వైరల్ జ్వరం, ఫ్లూ వంటి వాటి నుంచి రక్షించాలంటే ఈ జాగ్రత్తలు(Viral Fevers Precautions) తప్పనిసరి.
వర్షాకాలంలో పిల్లలకు సీజనల్ వ్యాధుల ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!
వైరల్ జ్వరాలు, ఫ్లూ సమస్యలతో బాధపడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- ముఖ్యంగా వైరల్ జ్వరాలు, ఫ్లూ మొదలైన వాటి బారిన పడేది ఎక్కువగా పిల్లలే! ఎందుకంటే వారు స్కూల్లో ఇతర పిల్లలతో కలిసి మెలిసి ఆడుకోవడం చేస్తుంటారు. అందుకు ఇతర పిల్లల నుంచి వారిని దూరంగా ఉంచడం చాలా కష్టం. అందుకే పిల్లలకు స్కూల్లో ఇతర పిల్లలతో ఉన్నప్పుడు చేతులు, కళ్లు, నోరు, ముక్కుకు దూరంగా ఉండమని తల్లిదండ్రులు చెప్పాలి. ఇంకా స్కూల్ బ్యాగులో శానిటైజర్ ఉంచి.. దాంతో తరచూ చేతులు శుభ్రం చేసుకోమనాలి. స్కూల్ నుంచి వచ్చాక తప్పనిసరిగా వేడి నీళ్లతో స్నానం చేయించాలి. స్నానం చేసిన తర్వాతనే స్నాక్స్ వంటివి తినమని చెప్పాలి. ఏదైనా పని చేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోమని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. ఇలా చేస్తే చాలా వరకు ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచవచ్చు.
- ప్రతి రోజు తాజా ఆహారం, వేడిగా అందివ్వాలి. కూరగాయలు, ఆకు కూరలతో చేసిన సూపులు ఎక్కువగా ఇవ్వాలి. గోరువెచ్చని మంచి నీళ్లు, ఎక్కువ మొత్తంలో పండ్లు వంటివి తింటే ఇంటిల్లిపాదీ.. అనారోగ్యం నుంచి దూరంగా ఉండగలరు. వీటితో పాటు రోజూ ఉదయాన్నే కాస్త ఎండలో ఉండేలా చూడటం, కొద్దిపాటి వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి.
- ఈ కాలం.. వర్షాకాలమైనా ఎండలు తెగ విసిగిస్తున్నాయి కదూ! చెమటల నుంచి తప్పించుకోవడానికి ఏసీ వంటివి వాడుతున్నారా.. అయితే వాటిని వాడకుండా ఉండటమే మంచిది. ముఖ్యంగా ఇంట్లో వాళ్లకు శ్వాస సంబంధిత సమస్యలు, జలుబు, జ్వర లక్షణాలు ఉన్నవారు అసలు వాడకపోవడమే మంచిది. పిల్లలకు వైద్యుల సలహాతో వ్యాక్సిన్ వేయిస్తే ఇంకా మంచిది.
- ఇంట్లో ఉద్యోగిని ఉంటే.. బస్సుల్లో ప్రయాణాలు తప్పనిసరా..! అయితే మాస్క్ తప్పని సరిగా ధరించాలి. ఇంకా ఆఫీసుల్లో సెంట్రల్ ఏసీల్లోనూ వైరస్లు విస్తరించే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటప్పుడు శానిటైజర్ అలవాటు చేసుకోవడం మంచిది. ఎవరైనా అనారోగ్యంగా కనిపిస్తే దూరంగా ఉండటం మంచిది. మీకు అనారోగ్య లక్షణాలు కనిపించినా మాస్క్ వాడటం మంచిది. దాని కన్నా ఆరోజు సెలవు పెట్టడమే మంచిది.
- నీటిలో అయోడిన్ ఆధారిత క్లీనింగ్ సొల్యూషన్ వేసి.. ఆ మిశ్రమంతో ఇంటిని మొత్తం తుడవాలి. ఇలా చేస్తే సూక్ష్మ క్రిములను హతమార్చవచ్చు. దోమల సమస్య ఉంటే వాటిని నిర్మూలించాలి. ఇవీ డెంగీ, మలేరియా వంటి జ్వరాలకు కారణాలు అవుతాయి. వాటి బారిన పడకుండా ఉండడానికి దోమ తెరలు, రెపల్లెంట్లు వంటివి ఉపయోగించాలి. ఇంటి చుట్టూ, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.