Vinod Kumar Comments On Central Government: సింగరేణిపై కేంద్రం కుట్రకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ విషయం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేసేందుకు .. కేంద్రం కోల్ బ్లాక్స్‌ను వేలం పాట ద్వారా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రైవేటీకరణకు.. వేలం పాట మధ్య ఉన్న తేడాను ముందు బండి సంజయ్ తెలుసుకోవాలని ఆయన సూచించారు.
సింగరేణిని నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఆగస్ట్ 10న నిర్వహించిన వేలం పాటలో.. సత్తుపల్లిలోని కోయలగూడెం మూడో కోల్ బ్లాక్‌ను ఔరో కోల్ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని తెలిపారు. ఈ వాస్తవాన్ని బండి సంజయ్ గమనించాలని పేర్కొన్నారు. సింగరేణికి కోల్ బ్లాక్స్ ఇవ్వకుండా వేలం పాట వేయడంలో దాగి ఉన్న మర్మం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోల్ బ్లాక్స్ లేకుండా ఆ సంస్థ ఏం చేయాలని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
కోల్ బ్లాక్స్‌ను సింగరేణి సంస్థకు అప్పగించాలి: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డున పడవేసేందుకు.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ అన్న పదాన్ని వాడకుండా వ్యూహాత్మకంగా కోల్ బ్లాక్స్ వేలం వేసి సంస్థను నీరు గార్చుతోందని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోల్ బ్లాక్స్‌ను సింగరేణి సంస్థకు అప్పగించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
కేంద్రం స్వస్తి పలకాలి: రాష్ట్రంలో కోల్ బ్లాక్స్‌ను వేలం వేసే పనులకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఓ వైపు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయబోమని ప్రధాని మోదీ చెబుతూనే.. మరోవైపు కోల్ బ్లాకులను వేలం వేస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా సింగరేణికి వాటిని దక్కకుండా ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 82 కోల్ బ్లాకులు ఉండగా, అందులో సింగరేణి సంస్థ 40 కోల్ బ్లాకులను వినియోగిస్తోందని.. మిగిలిన 42 కోల్ బ్లాకులను కూడా ఆ సంస్థకే అప్పగించాలని కేంద్రాన్ని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: PM Modi in Ramagundam : 'సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచనే కేంద్రానికి లేదు'
రేపు ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేసీఆర్ శ్రీకారం
'రాష్ట్రపతి ఓ స్వీట్ లేడీ'.. బంగాల్ మంత్రి వ్యాఖ్యలకు దీదీ క్షమాపణ