సమాచారం లేకుండా మార్కెట్‌ను కూల్చేస్తారా.. మేం ఎట్లా బతకాలి.. రేపటి నుంచి రోడ్డు మీద కూర్చోవాలా.. తమ ఆస్తి నష్టానికి ఎవరు బాధ్యులు.. నాయకులు ఎక్కడికి పోయారు.. మాకు నష్టం జరిగాక ఈ ప్రభుత్వం ఎందుకు... ఇవన్ని ప్రశ్నలు కాదు.. లింగంపల్లి మార్కెట్ కూల్చివేతతో బాధితులుగా మారిన వ్యాపారుల ఆర్తనాదాలు.
హైదరాబాద్‌లోని లింగంపల్లి మార్కెట్‌ను.. జీహెచ్ఎంసీ అధికారులు ఇవాళ కూల్చివేశారు. మందస్తు సమాచారం లేకుండా కూల్చివేస్తున్నారంటూ వ్యాపారులు ఆందోళకు దిగారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేసి నిర్మాణాలను తొలగిస్తున్నారు.
నారాయణగూడ చౌరస్తాలోని లింగంపల్లిలో దాదాపు 70 ఏళ్ల క్రితం నాటి జనాభాకు అనుగుణంగా.. మున్సిపల్ మార్కెట్లో సుమారు 50 దుకాణాలను నిర్మించారు. అప్పటి నుంచి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నారాయణగూడ రహదారిని పలుమార్లు విస్తరించారు. ఆ సమయంలో మార్కెట్‌ను స్వల్పంగా కూల్చి.. చిన్న దుకాణాలను నిర్మించి వ్యాపారులకు ఇచ్చారు.
షాపులు చిన్నగా ఉన్నా.. జీవనాధారం పోగొట్టుకోలేక వాటిలోనే వ్యాపారాలు చేసుకున్నాం. గతంలో కూల్చివేతల సమయంలో మందస్తు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఎవరికీ చెప్పకుండా నిర్మాణాలు తొలగిస్తున్నారు. డెబ్బై ఏళ్లుగా ఈ మార్కెట్‌నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ఎలాంటి హామీ ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను కూల్చివేయడం ఎంతవరకు సమంజసం.
-బాధితులు
నాయకులెక్కడ...
ఏ సమస్య వచ్చిన ఆదుకుంటామని ఎన్నికల మందు హంగామా చేసిన నాయకులు కనిపించడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలు రోడ్డున పడ్డా.. ఏ ఒక్కరూ అండగా నిలిచేందుకు రాలేదని వాపోయారు. కొత్తగా నిర్మించతలపెట్టిన మార్కెట్లో ప్రస్తుత వ్యాపారులందరికీ దుకాణాలు కేటాయించాలని కోరారు.
మార్కెట్ కూల్చివేతతో రోడ్డున పడ్డామని.. రేపటి నుంచి రహదారిపైన కూర్చొని వ్యాపారులు చేసుకోవాలా అంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం వల్ల చాలా ఆస్తినష్టం జరిగిందని వాపోయారు.
సిబ్బంది ముసుగులో..
ఓ వైపు మార్కెట్లో నిర్మాణాలు తొలగింపు పనులు కొనసాగుతుండగా.. పురపాలక సిబ్బంది ముసుగులో కొందరు ఇనుప చువ్వలు, ఇనుప దూలాలు, ఇతర సామగ్రి తీసుకెళ్తున్నారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు అక్కడే ఉన్నా.. పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
మోడల్ మార్కెట్...
నారాయణగూడ చౌరస్తాలోని లింగంపల్లి మున్సిపల్ మార్కెట్ శిథిలావస్థకు చేరిందని జీహెచ్ఎంసీ అధికారి వరప్రసాద్ తెలిపారు. నూతన నిర్మాణంలో భాగంగా సెల్లార్‌తో పాటు నాలుగు అంతస్థుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్టు వెల్లడించారు. మార్కెట్లో ఉన్న అందరు వ్యాపారులకు ముందస్తు సమాచారం ఇచ్చామన్నారు. మార్కెట్ భవనం శిథిలావస్థకు చేరిన దృష్ట్యా కూల్చి వేస్తున్నట్టు ఆయన వివరించారు.