రాజకీయ పార్టీల కార్యక్రమాలకు, ఎన్నికల్లో పోటీకి ఖర్చు అనివార్యమని.. కానీ హద్దు మీరుతోన్న ధన ప్రవాహంతో దుష్ప్రభావాలు తప్పవని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెచ్చరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఫోరమ్ ఫర్ డెమోక్రాటిక్ రీఫామ్స్ ఆధ్వర్యంలో రాజకీయాల్లో ధన ప్రాబల్యం జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీల హామీలపై గరిష్ఠ పరిమితి విధించాలని, ఫిరాయింపు చట్టాన్ని బలోపేతం చేయాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు అభిప్రాయపడ్డారు. వ్యవస్థలోని అంతర్గత లోపాలపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సూచించారు. కార్పొరేట్ సంస్థల నుంచి పార్టీలు ఫండింగ్ తీసుకోవటం నిషేధించాలని.. ప్రజల నుంచి నిధులు సేకరించాలని ఎంపీ అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తదితరులు తమ ఆలోచనలు పంచుకున్నారు. ఎన్నికల సంఘంతోనే సంస్కరణలు సాధ్యం కావని, రాజకీయ పార్టీలు కలిసి రావాలని కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.
సదస్సులో ఇవాళ చట్టబద్ధ పాలన, స్థానిక ప్రభుత్వాల తీరుపై చర్చించనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తదితర ప్రముఖులు పాల్గొనున్నారు.
ఇదీ చూడండి : మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్