వీణాధారిణి అయిన సరస్వతీ దేవి జన్మదినం సందర్భంగా నిర్వహించుకునే వసంత పంచమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. పర్వదినాన్ని పురష్కరించుకుని సరస్వతి ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేకువజామునుంచే పిల్లా పాపలతో క్యూ కట్టారు. వసంత పంచమి పురష్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లా కేంద్రం నందికొండ దుర్గామాత ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
వర్గల్ సరస్వతీ ఆలయంలో..
రెండో బాసరగా పేరుగాంచిన వర్గల్ సరస్వతీ ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ క్షేత్రం పీఠాధిపతి ముధుసుధనా సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు విద్యాజ్యోతిగా దర్శనమిచ్చారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన 56 నైవేద్యాలను సమర్పించి చెప్పన్ భోగ్ నిర్వహించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ప్రముఖ దర్శకులు హరీశ్ శంకర్ వీణా పాణిని దర్శించుకున్నారు.
అమ్మవారి ఆలయాల్లో వైభవంగా వేడుకలు
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్, వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలోని శిశు మందిర్ కేంద్రాల్లో... చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం మోతేలో... సరస్వతి అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. హైదరాబాద్లోని ముషిరాబాద్తో పాటు సంగారెడ్డిలోని డ్రైవర్స్ కాలనీలో సరస్వతిదేవి ఆలయానికి వేకువజామునుంచే భక్తులు భారీగా చేరుకున్నారు. పూజారులు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఖమ్మంలోని రామకృష్ణ విద్యాలయంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు..
ఇదీ చూడండి:సమత కేసులో ప్రత్యేక కోర్టు తుది తీర్పు... దోషులు ముగ్గురికి మరణ శిక్ష