Vande Bharat Train : దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వందే భారత్ రైలు తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఇవాళ ఉదయం రైల్వేస్టేషన్‌కు ఈ రైలును రప్పించారు. పూర్తిగా చైర్ కార్ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని అందువల్ల ఈ వందే భారత్ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యవంతగా ఉంటుందని.. 9.30 గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ సురేశ్ తెలిపారు.
విశాఖ నుంచే రైలు నిర్వహణ జరగనుంది కావున పర్యవేక్షణ నిమిత్తం న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌కు పంపించారు. లోకో పైలెట్ క్యాబిన్‌కు అనుసంధానంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ రైలు మొత్తం ఉంది. లోకో పైలెట్ ఆధీనంలో కోచ్‌ల ద్వారాలు తెరుచుట, మూయుట వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అత్యవసర సహాయార్ధం ద్వారం వద్ద టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టాయిలెట్ ఈ కోచ్ ప్రత్యేకత. ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు రైల్వే శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తొలి కూత అక్కడే.. ‘ట్రైన్-18’కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్(1.0)గా నామకరణం చేశారు. 2019 ఫిబ్రవరి 15న దిల్లీ - వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో 762 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ ఛైర్‌కార్ సీసీ క్లాస్ ధరను రూ.1,440గా నిర్దేశించారు. 2022 సెప్టెంబర్ 30న గాంధీనగర్ - ముంబయి వందేభారత్ 2.0 ట్రైన్‌ను ప్రారంభించారు.
తయారీ వేగానికి బ్రేకులు.. 2022 నాటికే 45 రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ కొవిడ్ కారణంగా అది నెరవేరలేదు. 2022 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ త్వరలో 400 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ రైళ్ల కోసం కావాల్సిన 36 వేల చక్రాలను తయారు చేసేందుకు భారత్.. ఉక్రెయిన్‌కు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా వాటి రాక ఆలస్యమైంది.
దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన భారత్ చెక్ రిపబ్లిక్, పోలండ్, మలేసియా, చైనా, అమెరికా దేశాల్లోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలోని స్టీల్ అథారిటీతో 1లక్ష చక్రాలు తయారు చేయాలని ఒప్పందం చేసుకుంది. దుర్గాపూర్ స్టీల్‌ప్లాంట్ యూనిట్‌లో వాటి ఉత్పత్తి జరుగుతోంది.
ఇవీ చదవండి: