ప్రేమ... ఈ పదం ఎందరికో మధురానుభూతిని అందిస్తుంది. ఇందుకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. యువతీయువకులు ఆ రోజున ప్రేమలో మునిగితేలుతారు. ఇష్టమైన వారు పక్కన లేకపోయినా.. వారి ఊహల్లో మైమరిచిపోతారు. అయితే ఇండోనేషియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలు మాత్రం వాలంటైన్స్ డేకు దూరంగా ఉంటున్నాయి. స్వేచ్ఛకు ప్రతిబింబమని చెప్పుకొనే అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోనూ ప్రేమికుల రోజుపై నిషేధం ఉంది.
ముస్లింలు అధికంగా ఉన్న దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియాలో ప్రేమికుల రోజును నిషేధించారు. కారణం అడగగా వాలంటైన్స్ డే ఇస్లాంకు వ్యతిరేకమన్నది అక్కడి అధికారుల సమాధానం. ముస్లింల జనాభా అధిక సంఖ్యలో ఉండే ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత ఉంది.
మలేషియాలోనూ ప్రేమ పండుగను విచిత్రంగా ప్రతిఘటిస్తున్నారు. ప్రేమ చిహ్నాలు, ఎమోజీలను వాడవద్దని అక్కడి ముస్లిం యువకుల సంఘం మహిళలను అభ్యర్థించి... పెర్ఫ్యూమ్ కూడా ఎక్కువ మోతాదులో వాడొద్దంటూ సూచిస్తారు.
రష్యా, ఇరాన్ దేశాల ప్రభుత్వాలు కూడా ప్రేమికుల రోజుకు పూర్తి విరుద్ధం. యువతీయువకులు వాలంటైన్స్ డేను జరుపుకోవడం వల్ల ఆయా దేశాల్లో విచ్చలవిడి శృంగారం, మద్యపానం పెరుగుతున్నాయనే వాదనే దీనికి ప్రధాన కారణం.
మన దేశంలోనూ ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని కొన్ని హిందూ అతివాద సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఎవరూ ఎన్ని రకాలుగా అడ్డు చెప్పినా కొందరు మాత్రం మనసుపడ్డవారికి ఏదో రకంగా ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
ఇదీ చదవండిః 'ప్రేమికుల రోజున.. పోలీసులు రక్షణ కల్పించాలి'