సూపర్ స్ప్రెడర్స్ (Super spreders)కు వ్యాక్సినేషన్ (Vaccination)లో భాగంగా ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు (Auto, cab drivers) నేటి నుంచి టీకా ఇవ్వనున్నారు. నిత్యం వందలాది మందితో కలుస్తుండటం కారణంగా... వైరస్ వ్యాప్తి కారకులు కాకూడదనే ఉద్దేశ్యంతో వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా... అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
10 కేంద్రాల్లో...
జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 10 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని రవాణా శాఖ విజిలెన్స్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న డ్రైవర్లు ముందుగా రవాణా శాఖ వెబ్సైట్ (Transport department)లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్న పాపరావు... తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఆర్సీ (RC) జిరాక్స్ కాపీ తీసుకురావాలని స్పష్టం చేశారు.
వినియోగించుకోండి...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 లక్షల పైచిలుకు ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. ఇందులో 2 లక్షల 25 వేల మంది ఆటోడ్రైవర్లు, లక్షా 10 వేల మంది క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లుండగా.... ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌ని వినియోగించుకోవాలని రవాణాశాఖ విజ్ఞప్తి చేస్తోంది.