పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫేస్‌బుక్ లైవ్‌లో పార్టీ నాయకులు, శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు. కరోనా ఇప్పట్లో పూర్తిగా పోదని.. సహాయ కార్యకలాపాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని సూచించారు. అవసరమైన చోట వలస కార్మికుల ఛార్జీలు భరించి, వాళ్లకు కావల్సిన వాహనాలు సమకూర్చాలని తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యం
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రైతుల సమస్యలను వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ నిరుత్సాహ పర్చే విధంగా ఉందన్నారు. పేదలను, ఉద్యోగులను ఆదుకునేలా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో ప్రజల మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.
ప్రభుత్వాలు చొరవ చూపాలి
మధ్య, చిన్న తరహా పరిశ్రమ దారులు అసంతృప్తితో ఉన్నారని, కొత్త వారికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదని ఆరోపించారు. కరోనా నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. మద్యం దుకాణాలు తెరవడం లాక్‌డౌన్‌కి విరుద్ధమని, రెడ్జోన్లలో కూడా లిక్కర్ షాపులు తెరవాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ విభేదిస్తున్నట్లు చెప్పారు.
అన్యాయం జరుగుతోంది
పోతిరెడ్డిపాడు హెడ్ రేగ్యులేటర్ విస్తరణతో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రధానంగా నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. ఆ విషయంలో గాంధీ భవన్‌లో దీక్ష చేశామని కృష్ణ నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలిపామన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌తో కూడా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు సార్లు భేటీ అయినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 40 కరోనా కేసులు నమోదు