తనకు పదవి ఉన్నా.. లేకపోయినా.. పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar reddy) స్పష్టం చేశారు. నూతన టీపీసీసీ కమిటీపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కొత్త పీసీసీ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని ఆయన సూచించారు. తనకు ఆరు సంవత్సరాల పాటు పీసీసీ అధ్యక్షుడిగా ఉండే అవకాశాన్ని ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
'కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ చీఫ్గా అవకాశం ఇచ్చింది. ఆరేళ్లపాటు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగా. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారు. కొందరు ఆస్తులు అమ్ముకొని కూడా కృషి చేస్తున్నారు.'
-ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఉత్తమ్ నిరాకరించారు. పార్టీలో అందరికీ అందరికీ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
అసమ్మతి
కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికపై పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఓటుకు నోటు కేసులాగే పీసీసీ ఎన్నిక జరిగిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. పీసీసీలో కార్యకర్తలకు తగినంత గుర్తింపు లేదని అసహనం వ్యక్తం చేశారు. టీపీసీసీ.. టీటీడీపీగా మారబోతోందని ఎద్దేవా చేశారు.
సీనియర్ల రాజీనామా
రేవంత్ రెడ్డి పేరు ప్రకటించగానే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్లకు తగినంత ప్రాధాన్యం లేదని ఆవేదన చెందగా.. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. సీనియర్ నేతలు అసమ్మతి వ్యక్తం చేసినా.. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్ఠానం నిర్ణయంపై ఉత్తమ్ సంతృప్తి వ్యక్తం చేశారు. పదవి ఉన్నా లేకపోయనా పార్టీ కోసం కష్టపడతానని వెల్లడించారు.
ఓటమి పాలైనా
కాంగ్రెస్లో ఉంటూ ఉత్తమ్ పలు పదవులు అలంకరించారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా కొనసాగారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆరేళ్ల పాటు పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. తన పదవీకాలంలో రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థలు, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ తరఫున సారథ్యం వహించారు. అన్నింట్లో ఓటమి పాలైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ డిసెంబరు 4, 2020న పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వతహాగా ప్రకటించారు.
ఇదీ చదవండి: bandi sanjay: 'పీవీని కాంగ్రెస్ అవమానించింది'