Heavy Rain In Hyderabad: హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రాత్రి అకాల వర్షం ముంచెత్తి పోసింది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్టతో పాటు.. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట్, సుచిత్ర, జీడిమెట్ల, సూరారంలో భారీ వర్షాలు పడ్డాయి. అలాగే కాచిగూడ, అంబర్పేట్, నల్లకుంట, విద్యాసాగర్, చర్లపల్లి, నాంపల్లి, లక్డికాపూల్, కోఠి, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, బేగంబజార్, సుల్తాన్ బజార్, నారాయణ గూడలోనూ భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. హిమాయత్ నగర్, లిబర్టీ, యూసఫ్‌గూడ, ఎల్బీనగర్, ఎర్రగడ్డ, వనస్థలిపురం, సోమాజిగూడ, పంజాగుట్ట, బోరబండ, సనత్‌నగర్, అమీర్‌పేట, టోలిచౌకీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, తార్నాక్, ఓయూ, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లోనూ ఇదే పరిస్థితి. రహదారులు చెరువులను తలపించాయి.
ముషీరాబాద్, రామ్‌నగర్, దోమలగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, గాంధీనగర్, విద్యానగర్, బాగ్‌లింగంపల్లి, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎర్రగడ్డలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగడంతో ఆ ప్రాంతం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైదాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో.. విద్యుత్ నిలిచిపోయింది. ఈ భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే అవకాశం ఉందని.. హైదరాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. పాదచారులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాలాల వద్దకు చిన్నపిల్లలను పంపించ వద్దని కోరారు.
అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో భారీ వర్షం పడడంతో.. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వికారాబాద్ జిల్లా పరిగి రోడ్డులో చెట్లు విరిగి పోయాయి. భారీ వర్షాలకు హైవేలపై నేమ్ బోర్డులు ఊడిపడడంతో.. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
నిజామాబాద్‌లో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు: నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వడగండ్ల వాన కురిసింది. సిరికొండ,వడగండ్ల వానకు పంటలు నాశనమయ్యాయి. వరి చేలు నేలకు ఒరిగాయి. వడ్లు రాలిపోయాయి. పంట కోసం కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బొగ్గు గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం ధాటికి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. జగిత్యాల జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షంతో పాటు.. వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన వరి పంట వాన నీటికి తడిపోయి.. కొట్టుకుపోయింది.
అలాగే మెదక్ జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు మొదలుకొని.. మరికొన్ని మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. అలాగే వికారాబాద్ జిల్లాలో వానతో పాటు బలమైన ఈదురుగాలులు వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి.. నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను తీరని నష్టాల్లోకి నెట్టేసింది. జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురిసాయి. కామారెడ్డి గాలులతో కూడిన వర్షంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇవీ చదవండి: