Kishanreddy fires on BRS Government : కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగిస్తూ.. కేంద్రంపైన రాష్ట్ర ప్రభుత్వం నిందలు వేయడాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగళ్ల వానలు, ఈదురుగాలులకు కోతకొచ్చిన పంటలు దెబ్బతిని రైతులు నష్టపోవడం చాలా విచారకరమన్నారు. ఇలా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వాలదేనన్న ఆయన.. దీనిని దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్రభుత్వం.. ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
మొదట్లో ఫసల్ బీమా యోజన పథకంలో చేరిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాత కారణాలేమీ చెప్పకుండానే ఈ స్కీమ్ నుంచి వైదొలిగిందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. అలాగని రాష్ట్ర ప్రభుత్వానికి... వివిధ కారణాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించే విషయంలో ఏదైనా స్పష్టత, నిర్దిష్ట ప్రణాళిక ఉందా అంటే అదీ లేదని విమర్శించారు. కేవలం రాజకీయ కారణాలతో ‘ఫసల్ బీమా యోజన’ నుంచి రాష్ట్ర సర్కార్ వైదొలిగిందని మండిపడ్డారు. ఆనాటి నుంచి ఇవాళ్టి వరకు పంట నష్టపోయిన రైతులు సరైన పరిహారం అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే నేటికీ ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు పంట నష్టాన్ని పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు.
ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులకు పరిహారాన్ని ప్రకటించే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కేంద్రం ఎటువంటి సహాయం చేయడం లేదంటూనే.. రాష్ట్ర ఖజానా నుంచి కాకుండా, ఎస్డీఆర్ఎఫ్(రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి) నుంచి రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తామని కేసీఆర్ చెప్పారని తెలిపారు. తదనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం మెమో విడుదల చేసిందన్నారు. వాస్తవానికి.. ఎస్డీఆర్ఎఫ్లో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన వారికి పరిహారాన్ని అందించటం కోసం కేంద్రం తనవంతుగా సహాయ సహకారాలను అందిస్తున్నప్పటికీ... సీఎం కేసీఆర్ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని కిషన్రెడ్డి పేర్కొన్నారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్లు కలిపి రాష్ట్రానికి రూ.3,06,987 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిన ప్రస్తుత సమయంలో నిజాలను దాచి.. ప్రజలను మభ్యపెట్టాలని చూడటం బీఆర్ఎస్ నాయకుల అవివేకమేనన్నారు. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేయడం మానుకొని.. ప్రజల ముందు వాస్తవాలను చెబితే హుందాగా ఉంటుందని కిషన్ రెడ్డి సూచించారు.
ఇవీ చదవండి: