జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్రనేతలు విస్త్రతంగా పర్యటిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భాజపా శ్రేణులు గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారని స్పష్టం చేశారు. దేశంలో 80శాతం కార్పొరేషన్‌లలో భాజపా అధికారంలో ఉందని వెల్లడించారు. వరద, బురద రాని హైదరాబాద్ నిర్మాణం చేస్తామని హామీనిచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలేక ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారని చెప్పారు.
2016లో ఇచ్చిన హామీలనే తెరాస మళ్లీ ఈసారి ఎన్నికల ప్రణాళికలో చేర్చిందని ఆరోపించారు. భాజపా అధికారంలోకి వస్తే వచ్చే వర్షాకాలం నాటికి వరదనీరు ఇళ్లకు చేరకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భాజపాపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలౌవుతున్న పథకాల్లో అధికశాతం కేంద్రం భాగస్వామ్యంతోనే ఉన్నాయని తెలిపారు.
ముంపు ప్రాంతాలను ఏపీకి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కుటుంబసభ్యులతో కలిసి సోనియాగాంధీని కలిసింది మీరు కాదా...! వ్యాపార ప్రచారం కోసం మెట్రోరైల్ పిల్లర్లను వదలటం లేదు. ప్రభుత్వానికి చెందిన అన్నిరంగాల్లో మీ పెత్తనం కొనసాగుతుంది. దుబ్బాకలో గెలుపును అంగీకరించాల్సిన బాధ్యత తెరాసపై ఉన్నది. నిన్న దుబ్బాక , ఇవాళ జీహెచ్ఎంసీలో భాజపా విజయ సాధిస్తుంది. - కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి