Nitin Gadkari Hyderabad Tour: అమెరికా తరహా హైవేలు తెలంగాణలో నిర్మాణమవుతాయని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు అనుసంధానిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ శంషాబాద్‌లో 12 జాతీయ రహదారుల విస్తరణ పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జీఎంఆర్ ఎరీనా వద్ద హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి.. అనంతరం ఇప్పటికే పూర్తయిన రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. ఏడు సీఆర్ఐఎఫ్ ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. రాంసాన్ పల్లి నుంచి మంగళూరు వరకు 4 వరుసల రహదారిని జాతికి అంకితమిచ్చారు.
తెలంగాణ ప్రగతిశీల రాజ్యం: దేశంలో మొత్తం 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామని గడ్కరీ అన్నారు. వాటిలో 5 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు తెలంగాణ మీదుగా వెళ్తాయని తెలిపారు. 2014 నుంచి 2022 వరకు రూ. 3 లక్షల కోట్లతో హైవేల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాజ్యమన్న గడ్కరీ... ప్రగతి సాధించాలంటే నీరు, విద్యుత్, రహదారులు, కమ్యూనికేషన్ ప్రధానమని అభిప్రాయపడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని గడ్కరీ అన్నారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవే దేశంలోనే అతి పెద్దదని.. ఈ హైవే ద్వారా ముంబయి నుంచి దిల్లీకి 12 గంటల్లోనే చేరుకుంటామని వెల్లడించారు.
"తెలంగాణలో 2014లో 2,511 కి.మీ మేర హైవేలు మాత్రమే ఉండేవి. భాజపా అధికారంలోకి వచ్చాక 4,996 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఎనిమిదేళ్లలో మేము మరో 2,450 కి.మీ హైవేల నిర్మించాం. రానున్న రోజుల్లో మరింత వేగంగా హైవేల నిర్మాణం చేపడతాం. ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది. తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాజ్యం. పెట్టుబడులు లేకుండా మనం అభివృద్ధి సాధించలేం. అభివృద్ధి సాధించకుండా మనం పేదరికాన్ని నిర్మూలించలేం." -నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి
అంతకుముందుగా సభలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణకు ప్రగతికి జాతీయ రహదారులు కీలకమనని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవతోనే తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కోసం కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. పెండింగ్ ప్రాజక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
సింహభాగం హైవేలకే: తెలంగాణలో అద్భుతంగా రహదారుల నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నితిన్ గడ్కరీ నేతృత్వంలో దేశంలో హైవేల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పెర్కొన్నారు. రాష్ట్రంలో ఏడున్నరేళ్లలో వందశాతానికిపైగా రోడ్ల నిర్మాణం జరిగిందన్న ఆయన.. రహదారుల కోసం రూ.1.04 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతోందని తెలిపారు. జాతీయ రహదారులకు మోదీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్న కిషన్ రెడ్డి.. బడ్జెట్‌లో సింహభాగం హైవేల నిర్మాణానికి కేటాయించారని వెల్లడించారు.
"హైదరాబాద్‌కు రావాలంటే ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంటుంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో 2,511 కి.మీ మాత్రమే హైవేలు ఉండేవి. మోదీ ప్రధాని అయ్యాక రాష్ట్రంలో ఏడున్నరేళ్లలో 4,996 కి.మీ హైవేల నిర్మాణం జరిగింది. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది. ఉత్తర ప్రాంతానికి సంబంధించి రూ.10 వేల కోట్లతో 182 కి.మీ రోడ్డు నిర్మాణం చేపట్టాం. దేశంలోని అన్ని రాష్ట్రాలు మోదీ ప్రభుత్వానికి సమానమే. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సైతం కేంద్రం కృషి చేస్తోంది. జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నాం." -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
460 కి.మీల రహదారుల పనులు: రూ.8,000 కోట్లకు పైగా వ్యయంతో 460కి.మీ మేర 12 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 96 కి.మీల రహదారి పనులు పూర్తయ్యాయి. రూ.1,614 కోట్లతో 47 కి.మీ మేర 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టారు. రూ.4,927 కోట్లతో చేపట్టే.. 258 కి.మీ. హైవేల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు.
ప్రశాంత్ రెడ్డి ప్రసంగానికి ఆటంకం: శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రసంగానికి ఆటంకం కలిగింది. ప్రశాంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగా భాజపా శ్రేణులు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేయడంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని కార్యకర్తలను వారించారు. అధికారిక కార్యక్రమంలో నినాదాలు వద్దని భాజపా శ్రేణులను ఆయన కోరారు.
ఇవీ చదవండి: 'కేసీఆర్ గురించి పీఎంవో అలాంటి సందేశం పంపలేదు'