రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో, కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ... రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ మహాదీక్ష చేపట్టింది.
ఈ మహాదీక్షను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రారంభించగా.. ఆచార్య కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్య పరిష్కరించడంలో పూర్తిగా చేతులెత్తేసిందని కోదండరాం విమర్శించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పాలన స్తంభించిపోయిందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేశారో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు మరో పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. సీపీఐ నిరుద్యోగుల పోరాటానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటివరకు అమలు చేయలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్