Secunderabad Ujjain Mahankali Bonalu 2023 : ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి... విశేష నివేదన చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి తొలి బోనం సమర్పించారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందన్నారు. అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించినట్లు తెలిపారు.
Thalasani First Bonam To Ujjain Mahankali : రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనాల ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. అందులో భాగంగా నేడు తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించానని వెల్లడించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ బోనం సమర్పించడానికి అక్కాచెల్లెళ్లు అందరూ వస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరిగే జాతర అని కొనియాడారు. తెలంగాణ రాకముందు మహంకాళి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని.. అప్పటి ప్రభుత్వాలను కోరడం జరిగిందన్నారు.
Ujjain Mahankali Bonalu 2023 : 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని తలసాని గుర్తు చేశారు. ఈ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రెండు నెలల నుంచి నిమగ్నమై ఉందని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం చేసిందని మంత్రి స్పష్టం చేశారు.
"సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర మా కుటుంబ సభ్యుల మొదటి బోనంతో ప్రారంభించాం. ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభమవుతాయి. మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమయ్యే జాతర.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఈరోజు, రేపు బోనాలు నిర్వహిస్తారు. వచ్చే 16,17 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని దేవాలయాల్లో జాతర ఉంటుంది. బోనాల జాతరను ప్రభుత్వ పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు నుంచి రేపు రాత్రి వరకు బోనాలు సమర్పణ, అమ్మవారి దర్శనం జరుగుతుంది. 8000 దేవాలయాలకు ఆర్థిక సాయం ప్రకటించిన మొదటి ప్రభుత్వం బీఆర్‌ఎస్‌నే." - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
పండుగులకు నిధులు కేటాయించిన ఘనత కేసీఆర్‌కే : రెండు రోజుల పాటు ఘట ఉత్సవాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, రంగం కార్యక్రమాలు కొనసాగుతాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో పండుగలకు నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని.. బోనాల ఉత్సవాల సందర్భంగా 8వేల దేవాలయాలకు ఆర్థిక సహాయం చేసినట్లు మంత్రి తెలిపారు. రాజకీయ, కులాలకు, మతాలకు అతీతంగా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. భాగ్యనగరంలో ఈ నెల 16, 17న ఉమ్మడి దేవాలయాలలో జరిగే బోనాలకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈరోజు మహంకాళి జాతర విశ్వవ్యాప్తమై.. విదేశాల్లో కూడా బోనాల జాతరను చేస్తున్నారు. దేశవిదేశాల నుంచి ఇక్కడకు బోనాల పండుగను వీక్షించడానికి వస్తున్నారన్నారు.
ఇవీ చదవండి :