ఈ చిత్రంలో పరీక్ష రాస్తున్నది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బిలేహాలు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు. కేవలం ఇద్దరే ఉన్నారు... మిగిలిన వారెక్కడ అని చూడాల్సిన అవసరం లేదు. తరగతిలో ఉన్నది వారిద్దరే..! అంతకంటే ఆశ్చర్యపోవాల్సిన అంశం మరొకటుంది. వారికి పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులే లేరు. గ్రామంలోని విద్యార్థుల కోసం 2017లో ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాల స్థాయికి పెంచారు.
ఉన్న ఒక్క మాస్టారూ.. వెళ్లారు.
ఒక్క ఉపాధ్యాయున్ని మాత్రం నియమించి ఆయనతోనే రెండేళ్లపాటు బోధన కొనసాగించారు. నెల రోజుల క్రితం ఆయన సైతం బదిలీపై వెళ్లిపోయారు. దీంతో అదే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులే ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ప్రస్తుతం 6 నుంచి 9వ తరగతి వరకు 82 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కిందటేడాది ఎనిమిదో తరగతిలో 25 మంది దాకా ఉండేవారు. ఒకే ఉపాధ్యాయుడు ఉండటం వల్ల ఇబ్బంది పడి చాలామంది 12 కి.మీల దూరంలో ఉన్న ఆలూరు మండలానికి వెళ్లి చదువుకుంటున్నారు. మల్లేశ్వరి, సుమిత్ర అనే విద్యార్థినులు అంతదూరం వెళ్లేందుకు ఇష్టం లేక ఇక్కడే 9వ తరగతిలో చేరారు. ప్రస్తుతం సమ్మెటివ్ పరీక్షలు ప్రారంభం కావడంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్న ఈ ఇద్దరితోనే రాయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: కాళ్లు చేతులు కోల్పోయి.. మళ్లీ కుంచె పట్టి..