Two Persons Died in Road Accident on ORR at Hyderabad : హైదరాబాద్లోని అవుటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road at Hyderabad)పై నిత్యం ఏదో ఒక రోడ్డు ప్రమాదం(Road Accident at ORR) జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రమాదంలో చాలా మంది మృత్యవాత పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా శామీర్ పేటలోని ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని వెనక నుంచి ఇన్నోవా వాహనం బలంగా ఢీకొట్టింది. ఇన్నోవా వాహనం పూర్తిగా నుజ్జునుజ్జుగా మారిపోయింది. దాంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
రోడ్డు ప్రమాదం జరిగిందనే సమాచారంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ దగ్గరలోని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న శామీర్పేట పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతులు డ్రైవర్ మారుతి, ప్రయాణికుడు రాజు కుత్బుల్లాపూర్ స్థానికులుగా పోలీసులు గుర్తించారు. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో వెళ్లి.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఓఆర్ఆర్పై వాహనాలు వేగంగా వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలుపుతున్నారు.
మరో ఘటనలో ఇద్దరు మృతి: మరో ప్రమాదంలో మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి కిష్టాపూర్ వెళుతున్న రోడ్డులో ఎదురు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాధమిక దర్యాప్తులో మృతులు.. స్నేహితుల పుట్టినరోజు వేడుకలు జరుపుకొని తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులు మేడ్చల్ మండల రావల్ కోల్ గ్రామానికి చెందిన భాను, హరి కృష్ణగా పోలీసులు గుర్తించారు. బొలెరో వాహనం డ్రైవర్ను ఇంకా గుర్తించాల్సి ఉంది.
అప్పటివరకు జన్మదిన వేడుకల్లో సంతోషంగా గడిపిన తమ మిత్రులు ఇలా ఒక్కసారిగా మృత్యువాత పడటంతో.. సహచరులు ఆవేదనకు గురయ్యారు. రాత్రి పూట డ్రైవింగ్ వద్దని.. ఉదయం పూట వెళ్లాలని సూచించినా.. పని ఉందని వెళ్లారని వాపోయారు. తమ కుమారులు ప్రయోజకులపై తమకు మంచిపేరు తెస్తారని భావించిన తల్లిదండ్రులు వారి అకాల మరణంతో ఒక్కసారిగా జీవచ్ఛవాలయ్యారు. ఇక తమకు దిక్కెవరు వంటూ వారు కన్నీరు పెట్టుకున్న వారిని ఆపడం ఎవరి తరం కాలేదు.