టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సైబరాబాద్ పోలీసులు నిర్ధరణకు వచ్చారు. టీవీ9కు సంబంధించిన పలు అంశాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృదం, సైబర్ క్రైమ్ అధికారులు శనివారం బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్న వారిని వాకబు చేయగా... బయటకు వెళ్లారని, ఎక్కడికి వెళ్తున్నారో తమకు చెప్పలేదని వివరించారు. రవిప్రకాశ్ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఇందుకు పదిరోజుల గడువు కావాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసు ఉన్నతాధికారులకు అభ్యర్థన పత్రం ఇచ్చారు. చరవాణులు కూడా స్విచ్ఛాప్ చేసి ఉండటం వల్ల ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లు నిర్ధరణకు వచ్చామన్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని తెలిపారు.
శివాజీకి మరోసారి తాఖీదు
ఇక విచారణకు హాజరుకాని నటుడు శివాజీకి మరోసారి తాఖీదులు ఇవ్వనున్నట్లు సైబారాబాద్ పోలీసులు తెలిపారు. అప్పటికీ స్పందించికపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. మరోవైపు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని పోలీసులు రెండోరోజూ విచారించారు. టీవీ9లో ఎవరు షేర్లు కొన్నారు...? ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయా...? ఫోర్జరీ లేఖను ఎవరు తయారు చేశారు?.. లాంటి ప్రశ్నలు మూర్తిని సైబరాబాద్ పోలీసులు అడిగారు.
ఇవీ చూడండి: టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై పలు కేసులు