బుల్లి తెర నటి శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని మధురానగర్‌లో తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఏపీ కాకినాడకు చెందిన శ్రావణి... మధురానగర్‌లో నివసిస్తోంది. గత కొంత కాలం క్రితం దేవరాజ్‌రెడ్డి.. టిక్‌టాక్ ద్వారా పరిచయమయ్యాడు. అయితే అతను శ్రావణిని తరచు డబ్బులు ఇవ్వమంటూ వేధించే వాడని... ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అతని వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. శ్రావణిని ప్రేమించినట్టు నమ్మించి... ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగినట్లు తెలిపారు. ఆ ఫొటోలు బయటపెడతానంటూ డబ్బులు డిమాండ్ చేశాడని వివరించారు. వేధింపులు అధికం కావడం వల్ల శ్రావణి ఇటీవల ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. అయినప్పటికీ యధావిధిగా వేధింపులకు గురికావడం వల్ల శ్రావణి ఆత్మహత్య చేసుకుందని... దేవరాజ్‌రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మనసు మమత, మౌనరాగం వంటి టీవీ సీరియళ్లలో శ్రావణి నటించింది. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో యువకుడు మృతి