telangana secretariat security: కొత్త సచివాలయ భద్రతను తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్‌కు అప్పగించారు. ఈ నెల 30వ తేదీన నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం జరగనుంది. దీంతో కొత్త సచివాలయ భద్రతను చేపట్టాలని టీఎస్ఎస్పీని డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఎస్పీఎఫ్ నుంచి భద్రతను చేపట్టాలని టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు సచివాలయ భద్రతను ఎస్పీఎఫ్ పర్యవేక్షిస్తోంది.
పటిష్ఠ నిఘా నీడ: కొత్త సచివాలయంలో భద్రత మరింత పటిష్ఠంగా ఉండాలన్న ఉద్దేశంతో స్పెషల్ పోలీస్‌కు అప్పగించారు. త్వరలోనే కొత్త సచివాలయ భద్రతను టీఎస్ఎస్పీ చేపట్టనుంది. ఇక నుంచి కొత్త సచివాలయానికి 650 మంది సిబ్బంది పహారా కాయనున్నారు. మూడు పటాలాల టీఎస్ఎస్పీ సిబ్బందిని సచివాలయ భద్రత కోసం వినియోగిస్తారు. 300 మంది వరకు సాయుధ రిజర్వ్ - ఏఆర్ సిబ్బందితో పాటు శాంతిభద్రతల పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు.
telangana state special police: ఎంపిక చేసిన సిబ్బందికి ఇప్పటికే మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. సచివాలయానికి నాలుగు వైపులా ఉన్న సెంట్రీ పోస్టులతో పాటు ప్రవేశ మార్గాల వద్ద ఉన్న పోస్టుల వద్ద సాయుధ సిబ్బంది నిరంతరం పహారా కాయనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రధాన ప్రవేశ ద్వారం తదితర కీలక ప్రదేశాల్లోనూ సాయుధ సిబ్బంది పహారా ఉంటుంది.
ఆరు అంతస్థులు, మెట్ల మార్గాలు, లిఫ్ట్‌ల వద్ద కూడా పోలీస్ సిబ్బంది భద్రత ఉంటుంది. సచివాలయంలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా 300 సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. తనిఖీల కోసం అధునాతన బాడీ బ్యాగేజీ, వెహికిల్ స్కానర్లను ఉపయోగిస్తారు.
యాగంతో ప్రారంభం.. యాగశాల ఏర్పాటు: తెలంగాణ రాష్ట్ర పరిపాలనా నూతన సౌధం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరగనుండగా.. ఆ రోజు ఉదయం నుంచే యాగం నిర్వహించనున్నారు. సచివాలయం ప్రారంభం సందర్భంగా నిర్వహించే యాగం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సచివాలయ ప్రాంగణంలో తాత్కాలిక యాగ శాల ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
- TS Constable Exam 2023: కానిస్టేబుల్ తుది రాత పరీక్ష తేదీ వచ్చేసింది
- Rain Alert : ఏపీలో మూడ్రోజులు.. తెలంగాణలో రెండ్రోజులు.. వానలే వానలు
- Congress VS BJP: కాంగ్రెస్, బీజేపీ 'కోట్ల' కొట్లాట.. దొందు దొందేనన్న బీఆర్ఎస్
- Ramadan 2023: ముస్లింలకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు