అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేతతో అంతరాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రద్దీ రూట్లలో బస్సు సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది.
కర్ణాటకకు బస్సు సర్వీసులు
కర్ణాటక నిబంధనలకు అనుగుణంగా రేపట్నుంచి టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకకు సర్వీసులు తిరిగేలా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మినహా కర్ణాటకలో అన్ని ప్రాంతాలకు తెలంగాణ బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. కర్ణాటకలో వారాంత కర్ఫ్యూ దృష్ట్యా శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
ఏపీ నుంచి రాష్ట్రానికి బస్సులు
రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ కూడా నిర్ణయం తీసుకుంది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బస్సులు నడవనున్నాయి. విజయవాడ సహా పలు ప్రాంతాల నుంచి రాష్ట్రానికి బస్సులు రానున్నాయి. ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా ఏపీఎస్‌ఆర్టీసీ కల్పించింది.
మహారాష్ట్రకు మంగళవారం నుంచి..
మహారాష్ట్రలోని గమ్యస్థానాలకు అక్కడి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడిపిస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్రకు మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగించాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: Cm Kcr Fun: సీఎం కేసీఆర్నే మాస్క్ తీయమన్నాడంటా!