Group-4 Edit Option in Telangana : గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకోవడానికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది.
ఏదో ఒక భాష మాత్రమే ఎంచుకోవాలి..: రికార్డు స్థాయిలో 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తుల్లో వివరాలను తప్పుగా నమోదు చేసిన కొందరు అభ్యర్థులు.. వాటిని సరి చేసుకోవడానికి అనుమతివ్వాలని టీఎస్పీఎస్సీని కోరారు. దీంతో స్పందించిన కమిషన్.. ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదని.. జాగ్రత్తగా సరి చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. ప్రశ్నపత్రం ఆంగ్లం, తెలుగు లేదా ఆంగ్లం, ఉర్దూలో ఉంటుందని.. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలిపింది.
లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి కొత్త షెడ్యూల్: మరోవైపు పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఈ నెలలో నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను కమిషన్ మార్చింది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా సెప్టెంబరు 4, 5, 6, 8, 11 తేదీల్లో సంబంధిత సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ విషయాలను వెల్లడిస్తూ.. పరీక్షల షెడ్యూలు జారీ చేసింది. పాలిటెక్నిక్ కళాశాలలో 247 లెక్చరర్ పోస్టులకు.. సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత కమిషన్ నోటిఫికేషన్లో జారీ చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం సాధ్యమైనన్ని పరీక్షలను కంప్యూటర్ విధానంలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించుకుంది. అందువల్ల పోస్టులకు సీబీఆర్‌టీ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.
పీఈసెట్ దరఖాస్తు గడువు పెంపు: వీటితో పాటు ఈ రోజు చివరి రోజు అయిన పీఈసెట్ దరఖాస్తు ప్రక్రియ గడువును పొడిగించింది. వ్యాయమ విద్య చేయాలని అనుకొనే వారికి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు ఈ నెల 16 వరకు పెంచుతూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులకు మరో అవకాశం కల్పించింది. ఈ నోటిఫికేషన్ను మార్చి 13న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
ఇవీ చదవండి: