TSPSC Group2 Exam Issue in Telangana : టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్-2లో 783 పోస్టులతో ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా, రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన కోరిక మేరకు నవంబరు 2, 3 తేదీలకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు.
ఈసారైనా గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరిగేనా - వచ్చే వారంలో క్లారిటీ
TSPSC Group 2 Exam Arrangements : నవంబరు 3 నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో బోర్డు ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా, మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు టీఎస్‌పీఎస్సీ కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్‌పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలు నిర్ణయించే అధికారం కమిషన్‌కే ఉంటుందని, ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవలే ప్రభుత్వం వెల్లడించింది. వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్‌పీఎస్సీ చర్చలు జరుపుతున్నా నిర్ణయం వెలువడలేదు.
Discussion On TSPSC Board Clearance : టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా కమిషన్ బోర్డు ఉండాలి. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్సీ సభ్యులు పేపరు లీకేజీ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఛైర్మన్ సహా ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండాపోయింది. కాగా ఛైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. అంటే బోర్డు ఇంకా ఉన్నట్లే లెక్క. రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి పంపిన వారెవరూ కమిషన్‌కు రావడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని నిపుణులు చెబుతున్నారు.
గ్రూప్-1 ప్రకటనపై కొత్త ప్రభుత్వం నిర్ణయమే కీలకం - మరీ చిక్కుముడి వీడేదెలా?
Telangana government focus on TSPSC board issue : టీఎస్‌పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలన్నా, పరీక్ష ఫలితాలు తెలపాలన్నా బోర్డు కావాల్సిందే. ప్రస్తుతం బోర్డులో ఉన్న ఇద్దరు సభ్యులు కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరికి యాక్టింగ్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించి, గ్రూప్-2 పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు టీఎస్‌పీఎస్సీ బోర్డులో ఛైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్తబోర్డును ఏర్పాటు చేస్తే, ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
TSPSC Board Issue : కొత్త బోర్డు ఏర్పాటుకు ఛైర్మన్‌తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయమై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని సంప్రదించింది. ఛైర్మన్‌తో పాటు సభ్యులకు ఉండాల్సిన విద్యార్హతలు, అనుభవ వివరాలను కమిషన్ వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను నియమించుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం కొత్తబోర్డు సభ్యులను నియమించిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ మొదలు కానుంది.
ఈసారైనా గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరిగేనా - వచ్చే వారంలో క్లారిటీ
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా - ఆమోదించని గవర్నర్