TSPSC Group 2 Exam Postponed : గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. గ్రూప్-2 నియామక పరీక్ష కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం, సుమారు ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Telangana Group 2 Exam Postponed : ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ మొదట సన్నాహాలు చేసింది. అయితే అదే సమయంలో మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని, అభ్యర్థులు డిమాండ్ చేయడంతో నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నవంబరులో జరగాల్సిన పరీక్షను 2024లో జనవరి 6, 7న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.
ఓవైపు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీపై దృష్టి సారించగా మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష మరోసారి వాయిదా పడింది. అయితే ఛైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించగానే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. కొత్తగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు నియమించిన తర్వాత గ్రూప్-2 పరీక్ష తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కొత్త బోర్డు ఏర్పాటుపై టీఎస్‌పీఎస్సీని సంప్రదించిన ప్రభుత్వం : కొత్త బోర్డు ఏర్పాటుకు ఛైర్మన్‌తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయమై ఇప్పటికే ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సంప్రదించింది. ఛైర్మన్‌తో పాటు సభ్యులకు ఉండాల్సిన విద్యార్హతలు, అనుభవ వివరాలను కమిషన్, రాష్ట్ర సర్కార్‌కు తెలిపింది. టీఎస్‌పీఎస్సీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను నియమించుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వం కొత్తబోర్డు సభ్యులను నియమించిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ మొదలు కానుంది.
Telangana Group 4 Final Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 తుది కీ విడుదల
గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనపై కీలకంగా మారనున్న ప్రభుత్వం నిర్ణయం : గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనపై(Telangana Group 1 Notification) కొత్త ప్రభుత్వం నిర్ణయం కీలకంగా మారనుంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేస్తామని హస్తం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. 503 పోస్టులతో కూడిన ఈ ప్రకటనపై తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా గత సర్కార్ జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో హాస్టల్ వెల్ఫేర్, గ్రూప్-3 అధికారుల పోస్టులకు ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాలేదు.
TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు