పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం, ప్లీనరీ సమావేశాలు, సంస్థాగత పునర్నిర్మాణంపై తెరాస దృష్టి సారించింది. ఏప్రిల్ 27న తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ప్లీనరీ సమావేశాలు గతేడాది కరోనా వల్ల జరపలేదు. ప్లీనరీ, పార్టీ ఇతర అంశాలపై చర్చించేందుకు కాసేపట్లో తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.
సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు ఛైర్‌పర్సన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులనూ ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీ నియామకంపైనా చర్చ జరగనుంది. ప్లీనరీ సమావేశాల అజెండా, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తదితర అంశాలపై చర్చించనున్నారు.
దిశానిర్దేశం..
రాష్ట్రంలో రానున్న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలపైనా కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో తేలిన అంశాలను పార్టీ నేతలతో పంచుకొని.. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఇటీవల కొందరు పార్టీ నేతల వైఖరి వివాదాస్పదంగా మారుతున్నందున.. కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
జాతీయస్థాయి రాజకీయాల్లో..
పెట్టుబడుల ఉపసంహరణలపై భాజపాయేతర సీఎంలు, ముఖ్యనేతలతో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కేసీఆర్ వెల్లడించారు. అనంతరం ఆ అంశంపై కదలిక లేదు. కేసీఆర్ దిల్లీ పర్యటన తర్వాత రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయస్థాయి రాజకీయాల్లో తెరాస పోషించాల్సిన పాత్ర, ముఖ్యంగా రైతు ఉద్యమం, పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలపై పార్టీ వైఖరిపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
'సీఎంగా కేటీఆర్'పై స్పష్టత!
కేటీఆర్ త్వరలో సీఎం అవుతారని పార్టీలో సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకు తీవ్ర చర్చనీయాంశంగా మారినందున.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ అంశంపై స్పష్టత ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఇవీచూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున 'కోటి వృక్షార్చన'