రాష్ట్ర రాజధాని నగరంపై పూర్తి పట్టు సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. సంస్థాగత కమిటీల పునర్మిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం, గోషామహల్ అసెంబ్లీ స్థానం కోల్పోవడంతో పాటు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో హైదరాబాద్ కోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ స్థానాల ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున.. ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. సభ్యత్వ నమోదుకు హైదరాబాద్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశించినంత స్పందన రాలేదని పార్టీ నాయకుల్లో కొంత అసంతృప్తి ఉంది. మరోవైపు ఈనెల 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియను మొదలు పెట్టింది. హైదరాబాద్‌లోని ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది.
ఈ నెల 7న కీలక సమావేశం
సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వార్డు స్థాయి, పట్టణాలు, నగరాల్లో డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తోంది. అయితే గ్రేటర్‌లోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. డివిజన్ కమిటీలతో పాటు బస్తీ కమిటీలను కూడా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. భాజపా, కాంగ్రెస్ కూడా గ్రేటర్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో... తెరాస క్రియాశీలక కార్యకర్తలు, ముఖ్య నాయకులందరికి పదవులు పంచేలా కసరత్తు చేస్తోంది. ఈనెల 7న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జలవిహార్‌లో గ్రేటర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గ్రేటర్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పోటీ చేసిన ఓడిన నేతలు, ఇతర ముఖ్యనేతలందరినీ సమావేశానికి పిలిచారు. సంస్థాగత కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కనీసం 51శాతం ఉండాలని ఇప్పటికే తెరాస నాయకత్వం స్పష్టం చేసింది. మహిళలకు కూడా తగిన ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
వాటితో పాటు..
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కమిటీలతో పాటు.. రాష్ట్ర కమిటీ, సోషల్ మీడియా, అనుబంధ సంఘాల్లోనూ గ్రేటర్‌లోని చురుకైన కార్యకర్తలకు కీలక పదవులు ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ తో పాటు హైదరాబాద్ లోనూ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి: modi - kcr meet: ప్రధాని మోదీకి పది లేఖలు అందజేసిన సీఎం కేసీఆర్