Trs Protest: గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని చింతల్‌లో ఎమ్మెల్యే వివేకానంద ఆందోళన చేపట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రానున్న రోజుల్లో భాజపాకు ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. యూసుఫ్‌గూడ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్ పాల్గొన్నారు. కట్టెలా మోపు నెత్తిన పెట్టుకుని మహిళలు నిరసన తెలిపారు. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ చౌరస్తాలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో.. రహదారిపై కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి వంట చేస్తూ నిరసన తెలిపారు.
భద్రాద్రి జిల్లా చంద్రుగొండలో తెరాస నేతలు చేసిన ధర్నాలో ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు పెంచి కేంద్రం ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఎంపీ నామా ఆరోపించారు. ఆదిలాబాద్‌లో తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కుమురం భీం చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో మేయర్ సునీల్ రావు పాల్గొన్ని.. ఖాళీ సిలిండర్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారని మేయర్ ఆరోపించారు. చొప్పదండిలో నిర్వహించిన నిరసనల్లో ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ పాల్గొన్నారు. తెరాస శ్రేణులతో కలిసి రాస్తారోకో చేశారు. కట్టెల పొయ్యి వెలిగించి వంట చేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు భారీ ధర్నా చేపట్టారు. రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1100లకు పెంచారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో శ్రేణులు నిరసన తెలిపారు. తక్షణమే ధరలు తగ్గించాలని.. లేదంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు: కేటీఆర్
ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!.. శిందే గ్యాంగ్ దూకుడు!!