TRS Plenary 2022: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు.. కేంద్రంతో ఢీ అంటే ఢీ.. అధికార, విపక్షాల మధ్య వాడీవేడి విమర్శలు, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు కేసీఆర్ సన్నాహాల నేపథ్యంలో తెరాస ప్లీనరీ రేపు జరగబోతోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం హెచ్ఐసీసీలో రాష్ట్ర ప్రతినిధుల మహాసభ జరగనుంది. ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం, రాజ్యసభ, లోక్‌సభల సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేలమందికి ఆహ్వానం పంపించారు.
పురుషులు గులాబీరంగు దుస్తులు, మహిళలు అదే రంగు చీరలతో హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. ఉదయం 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు... 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పతాకావిష్కరణ చేస్తారు. తర్వాత తెలంగాణ తల్లికి, అమరవీరులకు నివాళి అర్పించి... అనంతరం స్వాగతోపన్యాసం ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగే ప్లీనరీలో తీర్మానాలకు ప్రాధాన్యం ఉంది. ఈసారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.
తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు జెండాపండుగలో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ప్రతి గ్రామంలో, బస్తీల్లో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి జెండాలు ఎగురవేయాలని చెప్పారు. ఇప్పటికే రెండు దఫాలుగా అధికారంలో ఉన్న తెరాస మూడోసారీ విజయపంథాను కొనసాగించాలనే సంకల్పంతో ఉంది. దీనికి అనుగుణంగా కార్యాచరణ అమలు చేస్తోంది. 80,039 ఉద్యోగ నియామకాల ప్రకటన, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల సాయం, 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు, జీవో 111 రద్దు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అధినేత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఇవీ చదవండి :