KK On Central: ఉత్తర భారత్‌కే భాజపా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఆరోపించారు. దక్షిణ భారత్‌పై కేంద్రం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. డాలర్‌తో పొలిస్తే రోజురోజుకూ రూపాయి విలువ పడిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని ఆయన మండిపడ్డారు.
పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, సమ్మెపై ఆంక్షలు విధిస్తూ సర్క్యూలర్ ఇచ్చారని కేశవరావు అన్నారు. అయినప్పటికీ ధర్నాలు, ఆందోళనలు జరుగుతాయని తేల్చి చెప్పారు. దేశంలో తెలంగాణ అంతగా వివక్షకు గురైన రాష్ట్రం ఏదీ లేదన్నారు. రోజురోజుకూ దేశంలోని సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలపైనా చర్చించామని ఆయన తెలిపారు. తెలంగాణ జీఎస్‌డీపీ 5.06 లక్షల కోట్ల నుంచి 11.06 లక్షల కోట్లకు పెరిగిందని ఎంపీ కేశవరావు వెల్లడించారు.
తెలంగాణపై కుట్ర: నామ
భాజపాయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. తెలంగాణపై కావాలనే కుట్రలు చేస్తోందన్నారు. ఎఫ్ఆర్బీఎం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటోందని తెలిపారు. మనదేశంలో సింగరేణితో పాటు బొగ్గు నిల్వలు గణనీయంగా ఉన్నా.. దిగుమతులపై మొగ్గు చూపాల్సిన అవసరమేంటని నామ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన డిమాండ్లపై నిలదీస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: Bandi on KCR: విదేశీ కుట్ర ఉందనడం శతాబ్దపు జోక్: బండి సంజయ్