TRS MLA Rohit Reddy Fires on Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంజయ్‌కి సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. కర్ణాటక పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వెల్లడించారు. నోటీసులు రాలేదని అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నా అని పేర్కొన్నారు.
''నాపైన ఎలాంటి కేసులు, ఎఫ్ఐఆర్‌లు నమోదు కాలేదు. రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి ఆధారాలతో బండి సంజయ్ రావాలి. నిరూపించకపోతే ప్రజలకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. రేపు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వస్తా.'' - పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే
బీజేపీ ఆగడాలను ప్రజలు గమనించాలని రోహిత్‌రెడ్డి సూచించారు. ఈడీ నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు భయపడి ఈడీ, సీబీఐ, ఐటీని పంపిస్తున్నారని విమర్శించారు. న్యాయ వ్యవస్థపైన తనకు నమ్మకం ఉందని వెల్లడించారు. కేసీఆర్ వంటి నాయకుడు దేశానికి అవసరమని తెలిపారు. తనకు ఇచ్చిన ఈడీ నోటీసులు చూసి న్యాయవాదులు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. నోటీసుల్లో బయోడేటా మాత్రమే అడిగారని వివరించారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రగతిభవన్ బయల్దేరారు.
ఇక నిన్న రోహిత్ రెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. రోహిత్ రెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరపనుంది. ఈడీ నుంచి నోటీసులు అందాయని పైలట్ రోహిత్ రెడ్డి నిర్ధారించారు.
ఇవీ చూడండి: