తెరాస ప్రభుత్వం సహకార ఎన్నికల్లో గెలవడమే కాదు.. రైతులకు అందాల్సిన సేవల గురించి కూడా ఆలోచించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట రుణాలపై వడ్డీ రాయితీని పూర్తిగా నిలిపివేసిందని.. హమాలీ కూలీలకు చెల్లించాల్సిన రూ.11 లనూ ఇవ్వడం లేదని ఆరోపించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హమాలీలకు చెల్లించాల్సిన రూ.16లో రూ.11లను ప్రభుత్వం భరిస్తే.. కేవలం రూ.5లను మాత్రమే రైతులు చెల్లించేవారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు హమాలీ ఛార్జీలు పెరిగాయని.. ఆ మొత్తాన్ని రైతులపై మోపకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
కందుల మద్దతు ధర క్వింటాలుకు రూ.5 వేల 8 వందలుగా కేంద్రం ప్రకటించగా.. జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో కేవలం రూ.4 వేలకే కొనుగోలు చేస్తుండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ