మూలకణ విధానంతో కొవిడ్-19 మహమ్మారికి అడ్డుకట్ట వేసే చికిత్స విధానాన్ని హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌సెల్ ఆంకోలాజిక్స్ సంస్థ రూపొందించింది. ఊపిరితిత్తులు దెబ్బతిని వెంటిలేటర్‌పై ఉన్న రోగులను బతికించవచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. బొడ్డుతాడు నుంచి తీసి ప్రాసెస్ చేసి తయారు చేసిన మూలకణాలను నేరుగా రోగుల శరీరంలోకి ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. ఈ కణాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి వైరస్ తీవ్రతను తగ్గించి ఊపిరితిత్తులను బాగుచేస్తాయి. హెచ్‌సీయూలోని అస్పైర్-టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్(టీబీఐ)లో ట్రాన్స్‌సెల్ ఆంకోలాజిక్స్ అంకురసంస్థ ఈ మూలకణ చికిత్స విధానాన్ని తయారు చేసింది. సంస్థను నగరానికి చెందిన డాక్టర్ ద్రావిడ సుభద్ర 2017లో స్థాపించారు.
![](https://assets.eenadu.net/article_img/21a_65.jpg)
ఇప్పటికే వివిధ చికిత్సలకు బొడ్డుతాడు నుంచి తీసిన కణజాలం ఆధారంగా హిమాటో-గ్లోబల్ పేరిట మార్కెట్‌లోకి ఉత్పత్తులు విడుదల చేస్తోంది ఈ సంస్థ. తాజాగా కొవిడ్ రోగులకు చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ఈ చికిత్స వల్ల సైటోకైన్ స్టోర్మ్ (రోగి రోగనిరోధక శక్తి వారిపైనే దాడి చేయడం) దెబ్బతిన్న కణజాలాన్ని పునరుత్పత్తి చేయవచ్చని నిరూపితమైంది. అమెరికాలోని ప్రజారోగ్య సైన్సెస్ విభాగం జాక్సన్ హెల్త్ సిస్టమ్‌లోని సెల్ ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రం ఈ విధానాన్ని పరీక్షించి విజయవంతమైనట్లు పరిశోధనపత్రం సమర్పించింది. దీనిపై వర్సిటీ ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చికిత్స విధానం:
హిమాటో యూసీ(అంబిలికల్ కార్డ్)-మెసెంకైమల్‌స్టెమ్ సెల్స్(ఎంఎస్‌సీ) విధానం ద్వారా చికిత్స చేస్తారు. బొడ్డుతాడు నుంచి తీసిన కణజాలాన్ని చికిత్సకు అనుగుణంగా మార్పిడి చేసి కొవిడ్-19 రోగులకు ఎక్కిస్తారు. 72 గంటల వ్యవధిలో ప్రతి డోసుకు పది కోట్ల కణాలను రోగికి రెండుసార్లు ఇంట్రావీనస్ విధానంలో ఇస్తారు.
ఇదీ చదవండి: 'వైద్యంలో నిర్లక్ష్యానికి పరిహారం తప్పదు'