మార్చి నుంచి రాష్ట్రంలో ఈ నెల 17 వరకే 11,512 స్తంభాలు, 351 ట్రాన్స్‌ఫార్మర్లకు నష్టం వాటిల్లింది. ఒక స్తంభం పడిపోతే సగటున రూ.3వేలు ఖర్చవుతోంది. గత 3 నెలల్లో మరమ్మతుల కోసం డిస్కంలు రూ.5కోట్ల వరకూ వెచ్చించాయి. ఈ వేసవి ప్రారంభమైనప్పటి నుంచి పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులకు తోడు కొన్నిచోట్ల గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీస్తుండటంతో స్తంభాలు విరిగిపోతున్నాయి. చెట్లు విరిగిపడి లైన్లు దెబ్బతింటున్నాయి.
ఇటీవల హైదరాబాద్‌లో కొద్దిసేపు గాలివానతో 200 చోట్ల చెట్లు విద్యుత్ లైన్లపై పడి 85 స్తంభాలు నేలకొరిగాయి. ఆరుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు గద్దెలతో పాటు పడిపోయాయి. ఈ నెల 17న నల్గొండ సబ్ డివిజన్‌లో ఒక్కరోజునే 350 స్తంభాలు విరిగిపోయాయి. ఇలా రాష్ట్రమంతా రోజూ భారీగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా, లాక్‌డౌన్‌లోనూ సిబ్బందిని ఏదోలా తరలిస్తూ .. విద్యుత్ సరఫరా ఆగకుండా చూస్తున్నట్లు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ అన్నమనేని గోపాలరావు చెప్పారు.
ట్రాన్స్‌కో టవర్లపై ప్రాణాలతో చెలగాటం
ఇతర రాష్ట్రాలు, జిల్లాల మధ్య విద్యుత్ సరఫరా చేసే భారీ టవర్ లైన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు ట్రాన్స్‌కో ఎప్పటికప్పుడు ఏర్పాట్లుచేస్తోంది. ఇటీవల ఒకరోజు రాత్రి తెల్లవారుజామున ‘పులిచింతల-చిల్లకల్లు’ 220కేవీ విద్యుత్ లైన్ ట్రిప్ కావడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సరిచేయడానికి విద్యుత్ సిబ్బంది హైటెన్షన్ టవర్లు, లైన్లపై మరుసటిరోజు సాయంత్రం వరకూ కష్టపడ్డారు. మండుటెండలో నిలబడి ప్రాణాలొడ్డి పనులు చేశారు. భారీసైజు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే వాటిని మరమ్మతు కేంద్రానికి తరలించి తిరిగి తీసుకురావడానికి సమయంతో పాటు డబ్బు అధికమవుతుందని ఎక్కడ పాడైతే అక్కడ విప్పదీసి బాగుచేస్తున్నారు. దీనివల్ల రూ.లక్షల సొమ్ము, సమయం ఆదా అవుతున్నట్లు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. లాక్‌డౌన్‌లోనూ సిబ్బంది ప్రాణాలొడ్డి విద్యుత్ సరఫరా ఆగకుండా చూస్తున్నారని, ప్రజలు సకాలంతో బిల్లులు కట్టి సహకరించాలని కోరారు.