వర్షాకాలం మొదలైన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు(transco cmd prabhakar rao) అధికారులకు స్పష్టం చేశారు. గాలిదుమారాల వల్ల విద్యుత్ సరఫరాలో(Power supply) అంతరాయం ఏర్పడినా.. వెంటనే విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లైన్మెన్లు, మీటర్ రీడర్లు, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
విద్యుత్ సరఫరా ఆగొద్దు
గత వర్షాకాలంలో జీహెచ్ఎంసీలో భారీగా వరదలు వచ్చాయి. చాలా వరకు కాలనీల్లో నీరు చేరిపోయింది. ఆ నీటిని తొలగించే వరకు ఆ కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈసారి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అపార్ట్మెంట్ వాసులకు సెల్లార్లో ఉన్న మీటర్లను గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లోకి మార్చుకోవాలని సూచించామన్నారు. దాదాపు 60శాతం మంది మార్చుకున్నారన్నారు. మిగితావారు మార్చుకోలేదని.. అటువంటి వారు విద్యుత్ మెటీరియల్ తెచ్చుకుంటే.. విద్యుత్ శాఖ ఉచితంగా వాటిని అమర్చుతుందన్నారు. వర్షాకాలంలో ఒకవేళ వరదలు వచ్చినా.. అందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రమాదాలు జరగకుండా చర్యలు
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ శాఖలో జరిగే ప్రమాదాలతో పోల్చుకుంటే.. వినియోగదారుల ఇళ్లలో జరిగే ప్రమాదాల శాతం రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంటుందని తమ పరిశీలనలో తేలిందని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్యుత్ వైర్లు, స్విచ్‌లు వాడకపోవడం వల్ల ఇన్సులేషన్ పోయి.. విద్యుత్ షాక్‌లు సంభవిస్తుంటాయన్నారు. వర్షాకాలంలో గ్రీజర్, వాషింగ్ మిషన్ ముట్టుకోవడం వల్ల విద్యుత్ షాక్‌లు సంభవిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు.
వైర్లను ముట్టుకోవద్దు
విద్యుత్ షాక్‌లను నివారించేందుకు ఐఎస్ఐ మార్క్ ఉన్న విద్యుత్ పరికరాలను వినియోగించాలని సూచించారు. ఇంట్లో ఎంసీబీ ఏర్పాటు చేసుకుంటే.. ఏమైనా విద్యుత్ సమస్యలు తలెత్తినా.. ఎంసీబీ ట్రిప్ అవుతుందన్నారు. వర్షాకాలంలో గాలిదుమారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో లైన్‌కు మీటర్ మీటరున్నర దూరంలో ఉన్న చెట్టు కొమ్మలు వంటి తగలడం, చెట్టుకొమ్మలు విరిగి లైన్లపై పడడం జరుగుతుంది. ఎవ్వరూ కూడా కిందపడిన వైర్లను ముట్టుకోవద్దని.. అటువంటివి కనిపిస్తే.. విద్యుత్ శాఖకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: RIMS HOSPITAL: డబ్బులిస్తే ఉద్యోగం నీదేనన్నాడు.. చివరకు అరెస్టయ్యాడు..