గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం నియమించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి పాల్గొన్నారు. చట్టంలోని నిబంధనలపై పూర్తి అవగాహన పెంచుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
నియమ నిబంధనలను పూర్తిగా ఆకళింపు చేసుకుంటే ఎన్నికల విధులు సులువుగా నిర్వహించవచ్చని.. నామినేషన్ల స్వీకరణ మొదలు గెలిచిన అభ్యర్థిని ప్రకటించే వరకు రిటర్నింగ్ అధికారులు పూర్తి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వార్డుల వారీగా అధికారులు, సిబ్బంది, బృందాలపై అవగాహన పెంచుకోవాలని.. ప్రతీ ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ అందేలా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నకొద్దీ ఎన్నికల ప్రక్రియ సులువు అవుతోందన్న ఆయన... వివిధ రకాల సాఫ్ట్ వేర్ల అభివృద్ధితో మాన్యువల్ వర్క్ తగ్గిందని చెప్పారు.
కొవిడ్ నేపథ్యంలో ప్రతి దశలోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని... నిబంధనలు పాటించాలని కోరారు. ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అమలు చేస్తున్నందున.. ప్రతి వార్డులో విశాలంగా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఒక పోలింగ్ కేంద్రంలో దీన్ని అమలు చేయాలని పార్థసారధి చెప్పారు. ఎన్నికల నిర్వహణకు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పూర్తి సహకారం ఉంటుందని బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: 'కిడ్నాప్' కలకలం: బాధితుడి వాదన ఒకటి.. పోలీసుల వాదన మరొకటి!