Restaurant in Railway Coach at Kacheguda Railway Station : హైదరాబాదలో రైల్వే కోచ్‌లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో రైల్వే కోచ్‌లో ఏర్పాటు చేసిన.. మొట్టమొదటి రెస్టారెంట్ ఇదే అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో.. రెస్టారెంట్ ఆన్ వీల్స్ పేరుతో ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. దీని కోసం రెండు హెరిటేజ్ కోచ్‌లను అంతర్గతంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో.. ఆహార ప్రియులకు ప్రత్యేకమైన భోజనాన్ని అందించేందుకు ఈ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు.. రైల్వే శాఖ చెబుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే.. ఎడమచేతి వైపునకు పరివార్ పుడ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. రెస్టారెంట్‌కు చేరుకోగానే.. పట్టాలపై ఉన్న రెండు బోగీలు కనిపిస్తాయి. రైలులోకి ఏ విధంగా ఎక్కుతామో.. అదేవిధంగా అందులోకి ఎక్కి లోపలికి వెళ్లగానే అక్కడ వెయిటర్ దర్శనమిస్తారు. బోగీల లోపల ఇంటీరియల్ను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. రెస్టారెంట్‌కి వచ్చిన వారు కూర్చున్న కుర్చీల పక్కనే.. లైట్లను ఏర్పాటు చేశారు. వాటిని అక్కడ కూర్చున్న వారే వేసుకునేవిధంగా తీర్చిదిద్దారు. పాతకాలం నాటి కలాకృతులను రైలు కోచ్‌లలో ఏర్పాటు చేశారు.
Train Hotel Food Iteams : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రయాణికులతో పాటు.. నగరవాసులకు ఈ రెస్టారెంట్ విభిన్న రకాల రుచులను పంచుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంటుంది. రెండు ప్రత్యేకమైన కోచ్‌లలో రాజస్థాన్ అద్భుత కట్టడాల మాదిరిగా తీర్చిదిద్దారు. కాచిగూడ స్టేషన్‌లోని రెస్టారెంట్ ఆన్ వీల్స్ ఐదు సంవత్సరాల కాలానికి.. సికింద్రాబాద్‌కి చెందిన మెస్సరస్ పరివార్స్ హావ్ మోర్ వారికి కేటాయించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రైలు ప్రయాణికులు, సాధారణ ప్రజలకు శుభ్రమైన, నాణ్యతతో కూడిన ఆహారం, పానియాల కోసం వివిధ రకాల వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ కోచ్ రెస్టారెంట్లో ఉత్తర భారత వంటకాలు, దక్షిణ భారత వంటకాలు.. మొఘలాయ్, చైనీస్ వంటి బహుళ వంటకాలతో పాటు, జ్యూస్, ఫాస్ట్ పుడ్, టిఫిన్స్, టీ, బిస్కట్స్ లభిస్తాయని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సేవలను ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటలపాటు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి రైల్ కోచ్ రెస్టారెంట్.. ఎక్కడంటే.?
రైల్లో ప్రయాణం చేసిన అనుభూతి : ఇప్పటి వరకు రైలు ప్రయాణం చేసిన అనుభూతి మాత్రమే ఉందని.. ఇప్పుడు రైలులో ప్రయాణం చేస్తున్న అనుభూతి కల్గించే రెస్టారెంట్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని రెస్టారెంట్‌కు వచ్చిన వారు చెబుతున్నారు. ఇంటీరియల్ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారని.. ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. హైదరాబాద్‌లోని ఆహార ప్రియులకు, జంటనగర వాసులకు మరొక విలక్షణమైన ఆహారానికి కేరాఫ్ అడ్రస్‌గా.. రెస్టారెంట్ ఆన్ వీల్స్ నిలుస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. నగరవాసులు ఈ రెస్టారెంట్‌ను ఆదరించాలని కోరారు.
"స్థానికుల నుంచి రైల్వే ప్రయాణికుల నుంచి ఈ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌కి ఆదరణ వస్తోంది. ఫుడ్ తిని వారందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. రెస్టారెంట్ అవతల టిఫిన్, స్నాక్స్.. లభిస్తాయి. లోపల ఫుడ్ ఉంటుంది."-ముస్తఫా హుస్సేన్, రెస్టారెంట్ నిర్వాహకుడు
ఇవీ చదవండి :