హైదరాబాద్ చందానగర్‌లో జాతీయ రహదారిపై మియాపూర్ ట్రాఫిక్ సీఐ సుమన్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ విచ్చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ప్రమాదాల బారిన పడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని.. ప్రాణాలు కాపాడుకునేందుకు నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని పోలీసులు తెలిపారు. చలానాల కోసం కొందరు నాణ్యత లోపించిన హెల్మెట్లు ధరిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బండిపై వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పక ధరించాలని వాహనదారులకు సూచించారు. నాణ్యత లోపించిన హెల్మెట్‌ను తీసివేసి మంచి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని వాహనాలకు చలానా వేయకుండా అక్కడే హెల్మెట్లు కొని ధరించే విధంగా వారికి సూచించారు. మనిషి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదని... ప్రతి ఒక్కరూ తప్పనిసరి శిరస్త్రాణం ధరించి వాహనాలను నడపాలని... ప్రమాద సూచికలు ఉన్నచోట నిదానంగా వెళ్లాలని ట్రాఫిక్ సీఐ సుమన్ చెప్పారు.
ఇవీ చూడండి: ఓఆర్‌ఆర్‌పై 10 అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు