24 గంటలపాటు ఆగకుండా కురిసిన భారీ వర్షం వల్ల నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లు ధ్వంసమై.. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రంగంలోని దిగిన పోలీసులు.. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. వాహనాదారులు ఇబ్బందులు పడకుండా పలు ప్రత్యామ్నయ రహదారులను సూచిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గగన పహాడ్ వద్ద పల్లె చెరువు తెగడం వల్ల బెంగళూరు జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో బెంగళూరు, విమానాశ్రయం, కర్నూలు వెళ్లే వాహనదారులు మెహిదీపట్నం పిల్లర్ నెంబర్ 300 నుంచి రాజేంద్రనగర్ పోలీస్టేషన్, ఎన్‌ఐఆర్డీ మీదుగా ఓఆర్ఆర్ గేట్ 17 నుంచి వెళ్ళాలి. లంగర్ హౌస్ మీదుగా వెళ్ళేవారు పోలీస్ అకాడమీ ఎంట్రీ 18 వద్ద ఓఆర్ఆర్ గుండా వెళ్ళాలి.
చాంద్రాయణ గుట్ట నుంచి శంషాబాద్ వైపు వెళ్లేవారు.. బార్కాస్, పహడీ షరీఫ్, వీడియోకాన్ జంక్షన్ మీదగా వెళ్ళాలి. ఆరాంఘర్ వెళ్లేవారు.. ఫలక్నుమా, షామీర్ గంజ్, హసన్ నగర్ మీదుగా వెళ్ళాలి. గచ్చిబౌలి వైపు వెళ్ళేవారు.. మెహిదీపట్నం నుంచి టోలిచౌకి పై వంతెన నుంచి కాకుండా 7 టూంబ్స్ మీదుగా వెళ్ళాలి.
గచ్చిబౌలి నుంచి వచ్చే వారు షేక్ పేట నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పురానాపూల్ వంద ఫీట్ల రోడ్డు పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపిన పోలీసులు కార్వాన్ మీదుగా వెళ్ళాలని సూచించారు.
మలక్ పేట నుంచి కోఠి రహదారి మూసివేసిన అధికారులు నింబోలి అడ్డా, గోల్నాక, అంబర్ పేట, రామాంతాపూర్, ఉప్పల్ రూట్లలో వెళ్లాలన్నారు. ఆలీ కేఫ్, అంబర్ పేట్ మధ్యలో ఉన్న మూసారాంబాగ్ ఆర్టీఏ కార్యాలయం వంతెన మూసి ఉన్నందున ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని కోరారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో భారీగా పడిపోయిన విద్యుత్ డిమాండ్