హైదరాబాద్ నగరం తెలంగాణ గుండె లాంటిదని... దానిని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితముంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల పన్నులని పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌లో వరదలు వచ్చినపుడు చర్యలు చేపడతామని.. పట్టించుకోలేదన్నారు. నాలాలు, చెరువులు కబ్జా అయ్యాక... జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటామనడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.
నాలాలు, చెరువులు కబ్జా కాకుండా హైదరాబాద్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ... ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. మాఫియాకు మద్దతుగా ఉండేందుకే సీసీ కెమెరాలు పెట్టట్లేదని విమర్శించారు. తూతూమంత్రంగా మూసీ అభివృద్ధి చర్యలు చేపడుతున్నారని... త్వరలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
చెరువుల దగ్గర, శిఖం భూముల దగ్గర, నాలాల ఆక్రమణల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీసీ కెమెరాలు పెట్టట్లేదంటే... ఈ ఆక్రమించుకునే వాళ్లు, కబ్జా చేసుకునేవాళ్లంతా టీఆర్ఎస్ నాయకులే కాబట్టి, వారి బండారం బయటపడ్తదని ఇయ్యాల ప్రభుత్వం అక్కడ సీసీ కెమెరాలు పెడ్తలేదు. - రేవంత్ రెడ్డి
వర్చువల్ భేటీ ఎందుకు..?
ప్రత్యక్షంగా బల్దియా సమావేశాలు పెడ్తే... ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయనే కారణంతోనే వర్చువల్ సమావేశాలు పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్... భాగ్యనగరాన్ని చెత్త నగరంగా మార్చారని మండిపడ్డారు. నివాసయోగ్యమైన 16 మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం దక్కకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.
ఇదీ చూడండి: GHMC: తొలిసారి సమావేశమైన బల్దియా.. వార్షిక పద్దుపై సమగ్ర చర్చ